తెలంగాణలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు బియ్యం సరఫరా చేసే ప్రక్రియలో భారీ అక్రమాలకు పాల్పడిన 14 మంది రైస్ మిల్లర్లను రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అరెస్ట్ చేసింది. 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నిబంధనల ప్రకారం 'సన్న రకం' బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉండగా, వాటి స్థానంలో నాసిరకం 'దొడ్డు బియ్యాన్ని' అందజేసినట్లు వీరిపై అభియోగాలు నమోదయ్యాయి.

పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) ఈ నెల 24న అందజేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమకు కేటాయించిన సన్న రకం ధాన్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించుకుని, అందుకు బదులుగా ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు సేకరించిన దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించినట్లు అధికారులు గుర్తించారు. సేకరించిన నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించగా, అవి నిర్దేశిత సన్న రకం బియ్యం కాదని నిర్ధారణ అయ్యింది.

నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లులు సన్న బియ్యానికి బదులుగా సుమారు 3,385 టన్నుల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీనివల్ల ప్రభుత్వానికి బోనస్ రూపంలో సుమారు రూ.1.69 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి బియ్యం సేకరణను నిలిపివేయడంతో సుమారు రూ.242 కోట్ల మేర జరగాల్సిన భారీ ఆర్థిక నష్టాన్ని నివారించగలిగారు.

ఈ ఉదంతంపై మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. బియ్యం మళ్లింపు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఒప్పంద నిబంధనల ఉల్లంఘన, క్రిమినల్ కుట్ర వంటి సెక్షన్ల కింద విచారణ జరుపుతున్నారు. ఈ కుంభకోణంలో ఎవరైనా ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.