ఉన్నతాధికారుల పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఖాతాలు సృష్టించడం కలకలం రేపింది. ఈ ఘటనపై కలెక్టరేట్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కేటుగాళ్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరుతో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీలు తెరిచి వాటిని సర్క్యులేట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఖాతాల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, దీనివల్ల కలెక్టరేట్ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి (ఏవో) అహ్మద్ హుస్సేన్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అహ్మద్ హుస్సేన్ ఫిర్యాదు ఆధారంగా సైబర్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాల్‌రెడ్డి తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని ఆయన వివరించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లతో వచ్చే మోసపూరిత సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.