విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 - ఏకే 47'. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అక్టోబర్ 30న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, "క్రైమ్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఫన్ అన్నీ ఒకేచోట.. ఇది మిస్ చేయలేని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్" అని నిర్మాణ సంస్థ పేర్కొంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్ 2న, ఆ తర్వాత అక్టోబర్ 9న విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజాగా అక్టోబర్ 30 తేదీని ఖరారు చేశారు.

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వెంకటేష్ నటించిన బ్లాక్‌బస్టర్ 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రానికి త్రివిక్రమ్ రచయితగా పనిచేయడం విశేషం. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. దీనికి తోడు, వెంకటేశ్ చివరి చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా భారీ విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఇటీవల ఆమె పాత్ర 'స్వర్ణ'ను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. అందులో వెంకటేశ్ పాత్ర చిట్టిబాబు, "ఈ ఆడాళ్లకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు" అంటూ చెప్పే సంభాషణలు ఆకట్టుకున్నాయి. అలాగే, ఈ సినిమాలో యంగ్ హీరో నారా రోహిత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పోస్టర్‌ను బట్టి పోలీస్ అధికారి పాత్రలో కనిపించవచ్చని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద, ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.