నవంబర్ నుంచి చింతలపూడి పనులు: చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నవంబర్ నుంచి చింతలపూడి పనులు: చంద్రబాబు

Chandrababu Naidu orders Chintalapudi Lift Irrigation Project works to start this November
  • ఎత్తిపోతల పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం
  • 2028 డిసెంబర్ నాటికి 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ
  • పోలవరం కుడి, ఎడమ కాలువల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్దేశం
  • నిరంతర కార్యక్రమంగా జలధార-జలహారతి అమలుకు సూచన
  • తుపాను వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరిక
  • జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలోని కీలకమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను ఈ ఏడాది నవంబర్ నుంచి తిరిగి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అవసరమైన పర్యావరణ అనుమతులు ఇప్పటికే ఉన్నందున పనులు వెంటనే మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల పనులతో రాజకీయంగా తీరిక లేకుండా ఉన్నప్పటికీ, శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమీక్షలో రాష్ట్రంలో గుర్తించిన 36 ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. 2028 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టులన్నింటినీ అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికీ కుళాయి నీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

పోలవరంపై కీలక ఆదేశాలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత, సాంకేతిక అంశాల్లో ఎలాంటి రాజీ పడకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 90.2 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌లో గ్యాప్-1, గ్యాప్-2 పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని, కాలువల ద్వారా గరిష్ఠ స్థాయిలో నీటిని తరలించేలా సామర్థ్యం పెంచాలని సీఎం ఆదేశించారు. భద్రాచలం నుంచి విశాఖపట్నం వరకు అంతర్గత జల రవాణాకు అవసరమైన నావిగేషన్ వ్యవస్థను ఈ కాలువల ద్వారా అభివృద్ధి చేయాలని సూచించారు.

జలధార-జలహారతి నిరంతర కార్యక్రమం
భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన జలధార-జలహారతిని నిరంతర కార్యక్రమంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి చెరువులు, రిజర్వాయర్లలో నిల్వలను పెంచాలని సూచించారు. అలాగే కాలువలపై సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు.

తుపానుపై అప్రమత్తత
బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుని రిజర్వాయర్లు, చెరువులు నింపాలని, విపత్తు నిర్వహణపై సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Chintalapudi Lift Irrigation Project
Andhra Pradesh Water Resources
Irrigation Projects AP
Nimmala Ramanaidu
Delta Modernization Works

More Telugu News