జగన్ మేనమామ కాదు, కంసమామ: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ మేనమామ కాదు, కంసమామ: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Galla Madhavi calls Jagan a villainous uncle not a maternal uncle
  • జగన్ మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ అంటూ ఫైర్
  • సొంత మేనకోడలి పెళ్లిని అడ్డుకుంటున్నారని గళ్ళా మాధవి ఆగ్రహం
  • అధికారం కోసం అక్కాచెల్లెమ్మలంటూ ఓట్లు వేయించుకున్నారని ఆరోపణ
  • జగన్‌ను సమర్థిస్తున్నారంటూ పేర్ని నానిపై తీవ్ర విమర్శలు
  • కుటుంబాలను కలిపేది కూటమి అయితే, విడదీసేది జగన్ అని వ్యాఖ్య
మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని, ఆయన మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమవుతున్న 'కంసమామ' అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోసం 'అక్కాచెల్లెమ్మలు' అంటూ ఓట్లు వేయించుకుని, తీరా గద్దెనెక్కిన తర్వాత సొంత చెల్లిని, తల్లిని కూడా రోడ్డున పడేశారని ఆమె ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.

"ఒక నాయకుడి వ్యక్తిత్వం ఆయన మాటల్లో కాదు, చేతల్లో కనిపిస్తుంది. సొంత చెల్లెలు షర్మిల తన కుమార్తె వివాహానికి శుభలేఖలు పంచుతుంటే, ఆ వివాహం జరగకుండా అడ్డుకునేందుకు కన్నతల్లితోనే రాయబారాలు నడపడం జగన్ వికృత మనస్తత్వానికి నిదర్శనం. ఎన్నికల ముందు 'నేను మీ జగన్ మామను' అని చెప్పుకున్న వ్యక్తి, ఇప్పుడు సొంత మేనకోడలి పెళ్లిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది మేనమామ లక్షణం కాదు, కంసమామ వైఖరి" అని గళ్ళా మాధవి మండిపడ్డారు.

గతంలో జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలను, అండగా నిలిచిన తల్లి విజయమ్మను అధికారం రాగానే అవమానించి బయటకు పంపారని ఆమె ఆరోపించారు. "ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు కల్పించిన ఎన్టీఆర్ వంటి మహనీయులు ఏలిన గడ్డ ఇది. అలాంటి చోట సొంత చెల్లికి దక్కాల్సిన హక్కులను కాలరాస్తూ, మహిళా సాధికారత గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం" అని విమర్శించారు.

జగన్ చర్యలను వైసీపీ నేత పేర్ని నాని సమర్థిస్తున్నారంటూ గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. "గతంలో ప్రజలను కలవకుండా పరదాలు కట్టుకుని తిరిగిన జగన్‌కు, ఇప్పుడు మేనకోడలి పెళ్లికి అపరిచితులు వస్తారంటూ భద్రతా కారణాలు గుర్తుకొచ్చాయా? తప్పును సమర్థిస్తే రేపు సొంత కుటుంబంలోనే పేర్ని నానికి గౌరవం దక్కదు" అని ఆమె హెచ్చరించారు.

చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కుటుంబాలను కలుపుతూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే, జగన్ మాత్రం "విభజించు-పాలించు" అనే సిద్ధాంతంతో సొంత కుటుంబాన్నే ముక్కలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. తన కుటుంబంలోని ఆడబిడ్డలకే కనీస గౌరవం ఇవ్వలేని జగన్‌కు 'మామ', 'అన్న' అని పిలిపించుకునే నైతిక హక్కు లేదని గళ్ళా మాధవి స్పష్టం చేశారు.
Advertisement
Galla Madhavi
YS Jagan Mohan Reddy
YS Sharmila
TDP News
Andhra Pradesh Politics

More Telugu News