శ్రీకాకుళం జిల్లా రాజాంలో సంచలనం సృష్టించిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) లలిత కుమారి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె భర్త రాజునే ప్రధాన నిందితుడిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో పోలీసు జాగిలం కీలక పాత్ర పోషించి, నేరుగా నిందితుడిని గుర్తించడం గమనార్హం.

పోలీసుల కథనం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున లలిత కుమారి తన ఇంటి నుంచి స్కూటీపై బయలుదేరిన కొద్దిసేపటికే, సుమారు 100 మీటర్ల దూరంలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆమె తలపై బలమైన గాయాలు ఉండటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, క్లూస్ టీం ఆధారాలతో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని డీఎస్పీ రాఘవులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా, ఘటనాస్థలానికి డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. మృతదేహం వద్ద వాసన పసిగట్టిన జాగిలం, నేరుగా అక్కడే ఉన్న మృతురాలి భర్త రాజు వద్దకు వెళ్లి ఆగింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న బంధువులు, స్థానికులు ఒక్కసారిగా నివ్వెరపోయారు.

నిజానికి, పోలీసులకు ముందు నుంచే రాజు ప్రవర్తనపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. జాగిలం కూడా నేరుగా అతని వద్దకే వెళ్లడంతో వారి అనుమానం మరింత బలపడింది. దీంతో తక్షణమే రాజును అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 ఇప్పుడు భర్తనే అదుపులోకి తీసుకుని విచారిస్తుండటంతో హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీశాయా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.