విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం "ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47". ఎంతోకాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి వచ్చిన ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. అక్టోబరు 23న విడుదలైన ఈ ట్రైలర్, రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

వెంకటేశ్ 77వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం'పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన వెంకటేశ్, తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను యాక్షన్‌తో మిక్స్ చేసే త్రివిక్రమ్ కలవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ ట్రైలర్ ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, డింపుల్ హయతి నటిస్తున్నారు. నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ట్రైలర్ ట్రెండింగ్‌తో సోషల్ మీడియాలో 'ఆదర్శ కుటుంబం' హ్యాష్‌ట్యాగ్స్ మారుమోగిపోతున్నాయి. ట్రైలర్ సాధించిన ఈ అద్భుత విజయంతో సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.
Play video