ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో జరుగుతున్నది ఎన్నికలు కాదని, కేవలం గ్యాంగ్ వార్ మాత్రమేనని ఆయన ధ్వజమెత్తారు. రెండు కుటుంబాలకు చెందిన గ్యాంగులు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆరోపించారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే. బీహార్‌ను మించి పోయి, రెండు కుటుంబాలకు చెందిన ఒక హిందూ కుల గ్యాంగ్, మరో మైనారిటీ మతానికి చెందిన గ్యాంగ్‌లు మన రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నాయి" అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రెండు కుటుంబ గ్యాంగులకు అధికారం దక్కకుండా చేస్తే తప్ప ఏపీలో ప్రజలకు రక్షణ ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అభివృద్ధి కేవలం మూడవ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ వలనే సాధ్యమవుతుందని, అదే ఏపీకి శరణ్యమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. "అధికార పార్టీ, పోలీసులు, రెవెన్యూ అధికారులు.. ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి, స్థానిక ఎన్నికల్లో పోటీపడి నామినేషన్లు చించేస్తున్నారు" అని విమర్శించారు. 2021లో వైసీపీ చేసిన అరాచకం కంటే పదింతలు ఎక్కువ అరాచకం ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.