అద్దె చెల్లించకుండా ఓ వ్యక్తి నెలల తరబడి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని, పోలీసుల సమక్షంలో గది తాళాలు పగలగొట్టి చూడగా దిమ్మతిరిగే వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఆ గదిలో ఏకంగా రూ. 85 లక్షల విలువైన నకిలీ కరెన్సీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ పరిధిలోని ఖర్బీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం.. పుష్పక్ కృష్ణ భండార్కర్ అనే వ్యక్తి సుమారు ఏడాదిన్నర క్రితం ఖర్బీ ప్రాంతంలో రమేశ్ అనే వ్యక్తి వద్ద ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. 2026 జనవరితో అతని అద్దె ఒప్పందం ముగిసింది. అయితే, ఆ తర్వాత ఒప్పందాన్ని పునరుద్ధరించుకోలేదు, గదిని ఖాళీ చేయలేదు. పైగా గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం కూడా మానేశాడు. దీంతో ఇంటి యజమాని రమేశ్.. పుష్పక్‌ను గది ఖాళీ చేయమని కోరగా, అతను కత్తితో బెదిరించాడు. ఈ విషయమై రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నాన్-కాగ్నిజబుల్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పుష్పక్ గదికి తాళం వేసి ఎటో వెళ్లిపోయాడు.

అతను తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన రమేశ్, పోలీసులకు సమాచారం అందించి వారి సమక్షంలో గది తాళాన్ని పగలగొట్టారు. లోపల చూడగా బకెట్‌లో కట్టలు కట్టలుగా నోట్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న కాగితాలు, ఒక ప్రింటర్ కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాటిని పరిశీలించగా, అవి నకిలీ నోట్లని తేలింది.

గదిలో లభించిన నకిలీ కరెన్సీని నోట్ల లెక్కింపు యంత్రం సహాయంతో లెక్కించగా, పూర్తిగా ముద్రించిన రూ. 500 నకిలీ నోట్లు సుమారు రూ. 37 లక్షల వరకు ఉన్నాయి. అలాగే, ఒక వైపు మాత్రమే ముద్రించి, మరోవైపు ఖాళీగా ఉన్న అసంపూర్తి నోట్ల విలువ సుమారు రూ. 48 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మొత్తం మీద సుమారు రూ. 85 లక్షల విలువైన నకిలీ కరెన్సీని, నోట్ల ముద్రణకు ఉపయోగించిన ప్రింటర్, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిందితుడు పుష్పక్ కృష్ణ భండార్కర్ ప్రస్తుతం ముంబైలో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ముంబై పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ నకిలీ కరెన్సీ దందా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.