తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రయాణం తనకు ఒక 'తీర్థయాత్ర' లాంటిదని, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సామాన్యులు చేస్తున్న అసాధారణమైన కృషిని గౌరవించుకునే మార్గమని ఆయన అభివర్ణించారు. నేడు ప్రసారమైన 139వ 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లో మాట్లాడుతూ, ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచి, స్ఫూర్తినిచ్చిన శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

"పన్నెండేళ్ల క్రితం, విజయదశమి పర్వదినాన మనం ‘మన్ కీ బాత్’ ప్రారంభించాం. అప్పటి నుంచి మన ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ ప్రయాణంలో మీరంతా సహ ప్రయాణికులుగా, స్ఫూర్తిదాతలుగా ఉన్నారు. శతాబ్దాలుగా మన దేశంలో తీర్థయాత్రల సంప్రదాయం ఉంది. దేశ ప్రజల కృషిని దగ్గర నుంచి అర్థం చేసుకోవడానికి, వారి సేవలకు వందనం చేయడానికి ‘మన్ కీ బాత్’ నాకు ఒక తీర్థయాత్ర కన్నా తక్కువేమీ కాదు. సమాజం కోసం, దేశం కోసం జీవించే వ్యక్తులు స్వయంగా పుణ్యక్షేత్రాల వంటివారు " అని ప్రధాని పేర్కొన్నారు.

దేశంలోని సామాన్య ప్రజల కృషినీ, ధైర్యాన్ని, అంకితభావాన్ని, సేవా స్ఫూర్తిని చాటి చెప్పేందుకు 'మన్ కీ బాత్' ఒక అద్భుతమైన అవకాశమని ప్రధాని వివరించారు. ఈ 12 ఏళ్లలో, సమాజం దృష్టికి రాని ఎందరో మహానుభావుల అసాధారణమైన పనులను ఈ కార్యక్రమం ద్వారా దేశం ముందుంచామని గుర్తుచేశారు. 

"ఈ కార్యక్రమం ద్వారా నేను ఒకరకంగా మన దేశ ప్రజల శక్తికి నివాళులు అర్పిస్తున్నాను. దేశంలోని ప్రతి కుటుంబంతోనూ అనుబంధం పెంచుకునే అవకాశం నాకు లభించింది" అని తెలిపారు.

చాలా మంది ప్రజలు తనకు సందేశాలు పంపుతూ.. 'మన్ కీ బాత్' వింటున్నప్పుడు, తమ మధ్యలో ఒక కుటుంబ సభ్యుడిగా కూర్చుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని చెబుతుంటారని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. "శ్రోతలైన మీ అందరి ఆత్మీయత, అనురాగం నాకు నిజంగా అమూల్యమైన ఆస్తి" అని ప్రధాని భావోద్వేగంగా అన్నారు. తొలి 'మన్ కీ బాత్' కార్యక్రమం 2014 అక్టోబర్ 3న విజయదశమి రోజున ఆకాశవాణి, దూరదర్శన్ నెట్‌వర్క్‌లలో ప్రసారమైన విషయం తెలిసిందే.