న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఓటమి అంచున నిలిచిన జట్టును యువ సంచలనం తిలక్ వర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హేగ్లీ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో, 181 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ చివరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది. కేవలం 26 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేసిన తిలక్ వర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.

మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ, తన అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న స్ఫూర్తిని వెల్లడించాడు. "ఈ రోజు ఆటకు ముందు, నేను కోచ్ గౌతమ్ గంభీర్ సర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సర్‌తో మాట్లాడాను. వారు నాతో ఒక్కటే చెప్పారు, 'మేమంతా నిన్ను నమ్ముతున్నాం, యావత్ భారత్ నిన్ను నమ్ముతోంది. నువ్వు ఆఖరి వరకు క్రీజులో ఉంటే, కచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తావు' అని. వారి మాటలే నా మదిలో మెదిలాయి. అందుకే ఆటను వీలైనంత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాను" అని తిలక్ వివరించాడు.

ఒక దశలో 10.5 ఓవర్లకు 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి భారత్ తీవ్ర కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, ముందుగా నమన్ ధీర్‌ (17 బంతుల్లో 31)తో కలిసి ఆరో వికెట్‌కు 42 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. నమన్ ఔటైన తర్వాత, మరో తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 26 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు.

ఇద్దరు తెలుగు ఆటగాళ్లు కలిసి కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ కలిసి అజేయంగా 69 పరుగులు జోడించి, మరో బంతి మిగిలి ఉండగానే భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ తర్వాత "నితీశ్ రెడ్డి, నేను.. కలిసి మ్యాచ్‌ను ముగించడం చాలా ఆనందంగా ఉంది" అని తిలక్ చెప్పడం విశేషం.