నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా రెండో రోజూ బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ఫుకెట్ - కోల్‌కతా ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు ఒక సందేశం కనిపించడంతో శనివారం అధికారులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.

ఫుకెట్ నుంచి వచ్చిన విమానం కోల్‌కతాలో సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం, విమానంలోని టాయ్‌లెట్‌ను శుభ్రం చేస్తుండగా అద్దంపై చేతిరాతతో ఉన్న బాంబు బెదిరింపు నోట్‌ను క్యాబిన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు తక్షణమే ప్రయాణికులందరినీ విమానం నుంచి సురక్షితంగా దించివేశాయి.

అనంతరం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి, సీఐఎస్ఎఫ్, బాంబ్ స్క్వాడ్, ఎయిర్‌పోర్ట్ పోలీసులు సంయుక్తంగా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి సాగిన ఈ సోదాల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాలు గానీ లభించలేదని అధికారులు ధ్రువీకరించారు. కేవలం భయాందోళనలు సృష్టించేందుకే గుర్తుతెలియని వ్యక్తులు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు.

కాగా, శుక్రవారం కూడా విమానాశ్రయ ప్రాంగణంలోని మహిళల వాష్‌రూమ్‌లో ఇలాంటిదే ఒక బెదిరింపు లేఖ లభించింది. అయితే ఆ ఘటనలో కూడా అది బూటకపు బెదిరింపుగానే తేలింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడంతో విమానాశ్రయ అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రయాణికుల జాబితాను, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ బెదిరింపు నోట్ రాసిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.