దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటం సత్ఫలితాలనిస్తోంది. శనివారం నాడు (అక్టోబరు 24) నగరంలో గాలి నాణ్యత సూచీ (AQI) 191 వద్ద 'మోడరేట్' కేటగిరీలో నమోదైందని, ఇది గత దశాబ్ద కాలంలో నమోదైన అత్యుత్తమ గాలి నాణ్యత అని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. కోవిడ్-19 ప్రభావిత కాలాన్ని మినహాయిస్తే, పదేళ్లలో ఇదే అత్యంత మెరుగైన ఏక్యూఐ అని ఆయన అన్నారు. వాయు కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న నిరంతర పోరాటంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన అభివర్ణించారు.

గత గణాంకాలను పరిశీలిస్తే, అక్టోబర్ 24న 2024లో ఏక్యూఐ 306గా, 2025లో 275గా నమోదైందని, ఈ ఏడాదది 191కి తగ్గడం గణనీయమైన పురోగతిని సూచిస్తోందని మంత్రి వివరించారు. కాలుష్య నివారణకు చేపట్టిన స్థిరమైన చర్యలు, కఠినమైన అమలు, వివిధ ప్రభుత్వ ఏజెన్సీల సమన్వయంతో కూడిన జోక్యం వల్లే ఈ సానుకూల మార్పు సాధ్యమైందని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి రేఖా గుప్తా నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు సమగ్రమైన, కార్యాచరణ-ఆధారిత విధానాన్ని అవలంబిస్తోందని సిర్సా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నిబంధనల అమలు, రెగ్యులర్ తనిఖీలు, జిల్లా స్థాయి సమీక్షలు, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ వంటి బహుముఖ వ్యూహాలతో కాలుష్య కారకాలను మూలాల వద్దే అరికట్టడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.

గాలి నాణ్యతలో ఈ మెరుగుదల ప్రభుత్వ నిరంతర కృషి, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఢిల్లీ నివాసితుల సమష్టి సహకారం వల్లే సాధ్యమైందని మంత్రి అన్నారు. స్వచ్ఛమైన గాలి కోసం సాగుతున్న ఈ ప్రచారానికి మద్దతిస్తున్న ఢిల్లీ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా గాలి నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కాలుష్య నియంత్రణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని సంబంధిత శాఖలను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. జవాబుదారీతనం, సమర్థవంతమైన అమలు, ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తామని సిర్సా పునరుద్ఘాటించారు.

కాలుష్య నివారణ చర్యలను ముమ్మరం చేయడంలో భాగంగా, గత 24 గంటల్లో ప్రభుత్వం చేపట్టిన కీలక చర్యల వివరాలను కూడా వెల్లడించారు. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు 9,883 వాహనాలకు చలాన్లు విధించారు. గుర్తించిన ప్రాంతాల నుంచి 12,702 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. రోడ్లపై దుమ్ము ధూళిని నియంత్రించేందుకు 1,075 కిలోమీటర్ల మేర నీటిని చల్లారు. 2,223 మెట్రిక్ టన్నుల నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను తరలించడంతో పాటు, 2,810 కిలోమీటర్ల రోడ్లను మెకానికల్ స్వీపింగ్ ద్వారా శుభ్రం చేశారు.