ఏవీఎస్ రాజు మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సంతాపం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏవీఎస్ రాజు మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సంతాపం

CM Chandrababu and Minister Lokesh mourn the death of AVS Raju
  • నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపకులు ఏవీఎస్ రాజు కన్నుమూత
  • పారిశ్రామికవేత్తగా, సమాజ సేవకుడిగా రాజు సేవలు చిరస్మరణీయం అన్న చంద్రబాబు
  • నిర్మాణ రంగంతో పాటు సాహిత్యంలోనూ రాజు తనదైన ముద్ర వేశారన్న లోకేశ్‌
ప్రముఖ నిర్మాణ సంస్థ నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌సీసీ) వ్యవస్థాపకులు, ఛైర్మన్, పద్మశ్రీ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్ రాజు) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏవీఎస్ రాజు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఏవీఎస్ రాజు మరణంపై సీఎం చంద్ర‌బాబు విచారం వ్య‌క్తం చేస్తూ.. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జిల్లా అంతర్వేదిపాలెంలో జన్మించి, ఎన్‌సీసీ సంస్థను స్థాపించి ఉన్నత శిఖరాలకు చేర్చిన దార్శనిక పారిశ్రామికవేత్త అని కొనియాడారు. నిబద్ధత, నిజాయతీతో దేశ నిర్మాణానికి, అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, స్ఫూర్తిమంతమని పేర్కొన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా ఎన్‌సీసీ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో పేదలకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఏవీఎస్ రాజు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ కూడా ఏవీఎస్ రాజు మృతికి సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో ఎన్‌సీసీ సంస్థకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో రాజు గారి కృషి ఎనలేనిదని అన్నారు. ఆయన కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదని, గొప్ప పద్య రచయితగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారని గుర్తుచేశారు. వివిధ రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించే భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిందని లోకేశ్‌ వివరించారు. దశాబ్దాలుగా ఎన్‌సీసీ సంస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన మహనీయుడని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.

ఏవీఎస్ రాజు కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేస్తూనే, సాహిత్య రంగంలోనూ రాణించారు. మరోవైపు సామాజిక బాధ్యతతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన మరణం పారిశ్రామిక, సేవా రంగాలకు తీరని లోటని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
AVS Raju
NCC Founder
Chandrababu Naidu
Nara Lokesh
Nagarjuna Construction Company
Padma Shri AVS Raju

More Telugu News