కర్ణాటకలో 56శాతం రిజర్వేషన్లకు బ్రేక్.. కోటా పెంపుపై హైకోర్టు కీలక తీర్పు
Add ap7am to your home Screen

కర్ణాటకలో 56శాతం రిజర్వేషన్లకు బ్రేక్.. కోటా పెంపుపై హైకోర్టు కీలక తీర్పు

Break to 56 percent reservation in Karnataka High Court key verdict on quota hike
  • కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు రద్దు
  • బొమ్మై ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని కొట్టివేసిన హైకోర్టు
  • తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వానికి బొమ్మై సూచన
కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం పెంచిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోటాను రాష్ట్ర హైకోర్టు సోమవారం రద్దు చేసింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లను 50 శాతం నుంచి 56 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం రద్దయింది.

కర్ణాటక షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (రిజర్వేషన్) చట్టం, 2022ను సవాలు చేస్తూ మహేంద్ర కుమార్ మిత్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై చీఫ్ జస్టిస్ విభూ బఖ్రూ, జస్టిస్ కేఎస్ హేమలేఖలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ చట్టం ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 3 శాతం నుంచి 7 శాతానికి పెంచారు.

జనాభా నిష్పత్తికి అనుగుణంగా కోటాలను పెంచాలని జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు, గతంలో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అఖిలపక్ష సమావేశం అనంతరం కేబినెట్ ఆమోదంతో తొలుత ఆర్డినెన్స్ జారీ చేసి, ఆ తర్వాత శాసనసభలోని ఉభయ సభల్లో చట్టంగా ఆమోదించారు.

ఈ తీర్పుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే రిట్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో దీనిని సవాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కేవలం పరిపాలనా ఉత్తర్వు కాదని, కమిటీ నివేదిక ఆధారంగా శాసనసభ ఆమోదించిన చట్టమని ఆయన గుర్తుచేశారు. తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించకపోతే, తానే స్వయంగా ఈ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తానని బొమ్మై స్పష్టం చేశారు.
Advertisement
Karnataka High Court
SC ST Reservation
Basavaraj Bommai
Karnataka Reservation Quota
Reservation Limit Case
Karnataka SC ST Act 2022

More Telugu News