‘పొరపాటున డబ్బులు పంపాం’.. ఈ ఫోన్‌ కాల్‌ వస్తే జాగ్రత్త.. ఎస్‌బీఐ హెచ్చరిక!
Add ap7am to your home Screen

‘పొరపాటున డబ్బులు పంపాం’.. ఈ ఫోన్‌ కాల్‌ వస్తే జాగ్రత్త.. ఎస్‌బీఐ హెచ్చరిక!

SBI warns against phone calls claiming money sent by mistake
  • జంప్డ్‌ డిపాజిట్‌ స్కామ్‌పై ఎస్‌బీఐ హెచ్చరిక
  • చిన్న మొత్తాన్ని జమ చేసి బాధితుల్లో నమ్మకం కలిగించే యత్నం
  • డబ్బులు తిరిగి పంపాలంటూ యూపీఐ రిక్వెస్ట్‌
  • రిక్వెస్ట్‌ ఆమోదిస్తే పెద్ద మొత్తంలో నగదు పోయే ప్రమాదం
  • అత్యవసరమంటూ వచ్చే చెల్లింపు అభ్యర్థనలతో అప్రమత్తంగా ఉండాలన్న ఎస్‌బీఐ
మీ బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా రూ.100 లేదా రూ.500 జమయ్యాయి. కాసేపటికే ఓ ఫోన్‌ కాల్‌.. ‘అయ్యో! పొరపాటున మీ ఖాతాకు డబ్బులు పంపించాం. దయచేసి తిరిగి పంపండి’ అంటూ అవతలి వ్యక్తి అభ్యర్థన. మన డబ్బులు కాకపోవడంతో వెంటనే తిరిగి పంపించాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి! మీరు పంపే డబ్బులే కాదు.. మీ ఖాతాలో ఉన్న సొమ్ము కూడా ప్రమాదంలో పడొచ్చు. ఈ తరహా మోసంపై దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఖాతాదారులను అప్రమత్తం చేసింది.

చిన్న మొత్తంతో నమ్మకం.. పెద్ద మొత్తానికి టోకరా!
ఈ మోసాన్ని ‘జంప్డ్‌ డిపాజిట్‌ స్కామ్‌’గా పిలుస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు తొలుత బాధితుల ఖాతాల్లో చిన్న మొత్తాన్ని జమ చేస్తారు. ఆ తర్వాత పొరపాటున పంపించామని చెబుతూ ఫోన్‌ చేస్తారు. డబ్బులు తిరిగి పంపాలని కోరతారు. ఇక్కడే అసలు మోసం మొదలవుతుంది. సాధారణంగా డబ్బులు పంపాల్సిందిగా అడగడానికి బదులు.. యూపీఐ ద్వారా పేమెంట్‌ రిక్వెస్ట్‌ పంపిస్తారు. బాధితుడు దాన్ని ఆమోదిస్తే.. జమ చేసిన చిన్న మొత్తానికి బదులుగా ఖాతాలోంచి పెద్ద మొత్తంలో డబ్బులు మాయమయ్యే ప్రమాదం ఉంది.

తొందరపెడతారు.. భావోద్వేగాలతో ఆడుకుంటారు!
ఈ తరహా మోసాల్లో నేరగాళ్లు బాధితులను కంగారు పెట్టే ప్రయత్నం చేస్తారు. అత్యవసరమని, వెంటనే డబ్బులు పంపాలని ఒత్తిడి చేస్తారు. వారి మాటలు నమ్మి తొందరపడి యూపీఐ రిక్వెస్ట్‌ను ఆమోదిస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. చిన్న మొత్తాన్ని ముందుగా జమ చేయడం ద్వారా బాధితుల్లో నమ్మకం కలిగించడమే ఈ ముఠాల ప్రధాన వ్యూహం.

ఎస్‌బీఐ సూచిస్తున్న జాగ్రత్తలివే!
జాతీయ సైబర్‌ భద్రత ప్రత్యేక ప్రచారం 6.0లో భాగంగా ఎస్‌బీఐ ఈ మోసంపై హెచ్చరికలు జారీ చేసింది. అనుమానాస్పద కాల్స్‌ వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనుమానం కలిగించే నంబర్లను బ్లాక్‌ చేసి, బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. అత్యవసరమంటూ వచ్చే యూపీఐ చెల్లింపు అభ్యర్థనలను ధ్రువీకరించకుండా ఆమోదించొద్దని స్పష్టం చేసింది.

డబ్బులు జమైతే ఏం చేయాలి?
మీరు ప్రారంభించని యూపీఐ పేమెంట్‌ రిక్వెస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దు. గుర్తు తెలియని వ్యక్తి పంపిన డబ్బులను తిరిగి పంపేందుకు తొందరపడకండి. బ్యాంకు అధికారిక నంబరుకు ఫోన్‌ చేయడం లేదా సమీప శాఖను సంప్రదించడం మంచిది. ఖాతాలో జమ అయిన మొత్తంపై బ్యాంకు సిబ్బందికి వివరించి, తదుపరి చర్యలు వారి సూచనల మేరకు తీసుకోండి. బ్యాంకు పేరుతో వచ్చే కాల్స్‌ను కూడా జాగ్రత్తగా ధ్రువీకరించండి.
Advertisement
SBI
Jumped Deposit Scam
UPI Fraud Warning
Cyber Security Awareness
State Bank of India
Online Banking Safety

More Telugu News