కామారెడ్డిలో వింత దొంగతనం.. నైటీలతో అంబులెన్సులో వచ్చి, ఏటీఎం లూటీ!
Add ap7am to your home Screen

కామారెడ్డిలో వింత దొంగతనం.. నైటీలతో అంబులెన్సులో వచ్చి, ఏటీఎం లూటీ!

Kamareddy ATM Robbery Strange theft as thieves arrive in ambulance wearing nighties to loot ATM
  • కామారెడ్డి జిల్లాలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ
  • గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి నగదు లూటీ
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
  • ఇటీవల కరీంనగర్‌లోనూ ఇదే తరహా ఘటనలు
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి మండ‌ల కేంద్రంలో ఒక వింత దొంగతనం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అంబులెన్సులో వచ్చి, నైటీలు ధరించి ఒక ఎస్‌బీఐ ఏటీఎంను కొల్లగొట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 11న తెల్లవారుజామున 1 నుంచి 1:30 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. దుండగులు ముఖాలకు మాస్కులు, ఒంటిపై నైటీలు వేసుకుని అంబులెన్సులో వచ్చారు. గ్యాస్ కట్టర్ల సాయంతో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి, అందులోని నగదును దోచుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఉదయం ధ్వంసమైన ఏటీఎంను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. చోరీకి ఉపయోగించిన అంబులెన్స్ నిజమైనదా? లేక పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఉపయోగించారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

ఏటీఎంలో ఎంత నగదు చోరీకి గురైందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాంకు అధికారుల లెక్కల తర్వాతే నష్టం ఎంతనేది తెలుస్తుంది. కాగా, సెప్టెంబర్ 19న కరీంనగర్ శివార్లలోని దుర్శేడ్, తిమ్మాపూర్ వద్ద రెండు ఎస్‌బీఐ ఏటీఎంలలోనూ ఇదే తరహాలో దొంగతనాలు జరిగాయి. అక్కడ కూడా దుండగులు మహిళల దుస్తులు ధరించి, గ్యాస్ కట్టర్లు వాడటం గమనార్హం.
Advertisement
Kamareddy ATM Robbery
SBI ATM Theft
Gandhari Mandal
Gas Cutter Robbery
Telangana Crime News
Ambulance Loot

More Telugu News