దాడితో దద్దరిల్లిన రియాద్‌ ఎయిర్ పోర్టు.. వీడియోల్లో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు!
Add ap7am to your home Screen

దాడితో దద్దరిల్లిన రియాద్‌ ఎయిర్ పోర్టు.. వీడియోల్లో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు!

Riyadh Airport shaken by attack terrifying visuals in videos
  • భయంతో పరుగులు తీస్తున్న ప్రయాణికుల దృశ్యాల వైరల్‌
  • ఈ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య
  • 309 మంది గాయపడినట్లు తెలిపిన సౌదీ అధికారులు
  • గాయపడిన భారతీయుడు చికిత్స పొందుతూ మృతి
  • ఆదివారం విమానాశ్రయ టెర్మినల్‌పై మరో రాకెట్‌
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఆకాశంలో నుంచి దూసుకొచ్చినట్లు కనిపిస్తున్న ఓ రాకెట్‌.. ఒక్కసారిగా వినిపించిన పేలుడు శబ్దం.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న ప్రయాణికులు.. ఈ దృశ్యాలు దాడి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరగా.. 300 మందికి పైగా గాయపడ్డారు.

అల్‌ అరేబియా విడుదల చేసిన ఓ వీడియోలో విమానాశ్రయంపై హూతీ దాడికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో వీడియోలో విమానం ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

దాడి సమయంలో భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. విమానాశ్రయంలో పలువురు గాయాలతో నేలపై పడి ఉండటాన్ని ఓ వ్యక్తి చూసినట్లు రాయిటర్స్‌ తెలిపింది. క్షతగాత్రులను తరలించేందుకు పెద్ద సంఖ్యలో అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి.

శనివారం జరిగిన దాడిలో తొలుత 12 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. గాయపడిన భారతీయుడు ఆదివారం మృతి చెందడంతో సంఖ్య 13కు చేరింది. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. సౌదీ పౌర విమానయాన సంస్థ ప్రకారం.. 309 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

శనివారం దాడి తర్వాత రియాద్‌ విమానాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ఆదివారం మరో రాకెట్‌ ప్రయాణికుల టెర్మినల్‌ను తాకినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఏపీ) తెలిపింది. ఐదు రోజుల్లో విమానాశ్రయంపై నాలుగుసార్లు దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ దాడులకు తామే బాధ్యులమని హూతీలు ప్రకటించినట్లు ఏపీ వెల్లడించింది.
Advertisement
Riyadh Airport
King Khalid International Airport
Houthi attack Saudi Arabia
Riyadh airport explosion video
Saudi Arabia rocket attack
Indian killed in Riyadh attack

More Telugu News