మరుగునపడిన చరిత్రకు జీవం.. ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేశ్‌ ప్రశంసలు
Add ap7am to your home Screen

మరుగునపడిన చరిత్రకు జీవం.. ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేశ్‌ ప్రశంసలు

  • రాయలసీమ యోధుడి కథను తెరకెక్కించిన తీరు అద్భుతమన్న లోకేశ్‌
  • విజయ్ దేవరకొండ నటన, దర్శకుడి ప్రతిభపై అభినందనలు
  • బ్రిటిష్ పాలన, కరవు నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా
  • దసరా కానుకగా అక్టోబర్ 16న సినిమా విడుదల
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ ట్రైలర్‌ను వీక్షించి, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత రెట్టింపైంది.

‘రణబాలి’ ట్రైలర్ చూసిన అనంతరం నారా లోకేశ్‌ సోషల్ మీడియా వేదికగా తన స్పందనను పంచుకున్నారు. "19వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొన్న బ్రిటిష్ పాలకుల అణచివేత, భయంకరమైన కరవు పరిస్థితులను తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. చరిత్రలో మరుగునపడిన ఓ వీరోచిత పోరాటాన్ని వెలుగులోకి తెస్తున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌కు అభినందనలు" అని పేర్కొన్నారు. 

రాయలసీమ యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుందని, రష్మిక పాత్ర కూడా కథలో కీలకంగా కనిపిస్తోందని ఆయన ప్రశంసించారు. సినిమా ఘన విజయం సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన 3 నిమిషాల 47 సెకన్ల ట్రైలర్ అంచనాలను తారస్థాయికి చేర్చింది. 

1854-1878 మధ్య కాలంలో బ్రిటిష్ పాలనలో పన్నుల భారం, ఆకలి చావులతో అల్లాడుతున్న ప్రజల కోసం పోరాడిన ‘శింగనమల బొబ్బిలి రణబాలి’ అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. 

రాయలసీమ యాసలో ఆయన పలికిన సంభాషణలు, పోరాట సన్నివేశాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న ‘జయమ్మ’ పాత్రలో నటిస్తున్నారు. లోకేశ్‌ ప్రశంసలతో ‘రణబాలి’ ప్రమోషన్ కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి.
Advertisement

More Telugu News