కోలీవుడ్ హీరోలలో యాక్షన్ హీరోగా ఆర్యకి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఆర్య నుంచి ఇటీవల ఒక యాక్షన్ సినిమా వచ్చింది. ఆ సినిమా పేరే 'అనంతన్ కాడు'. జియేన్ కృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, గోకులం మూవీస్ బ్యానర్ పై నిర్మితమైంది. జూన్ 25వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా,సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంటుగా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.

 మురళి (దేవ్ మోహన్) కృష్ణమూర్తి (ఇంద్రన్స్) జాక్సన్ (అప్పాని శరత్) తంగరాజ్ అనే నలుగురు స్నేహితులు కలిసి నేరాలు .. హత్యలు చేస్తుంటారు. ఈ టీమ్ చేసే నేరాల వెనుక పోలీస్ ఆఫీసర్ సంపత్ రావు (సునీల్) ఉంటాడు. అతని వెనకుండి ఇదంతా చేయించేది ముఖ్యమంత్రి మీనన్ ( విజయ రాఘవన్). అయితే సంపత్ రావు వరకు మాత్రమే ఈ బృందానికి తెలుసు. సంపత్ రావు కారణంగా ఏనాటికైనా తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఈ నలుగురూ భావిస్తూ ఉంటారు.

అధికారంలో ఉన్న పార్టీని ఎప్పటికప్పుడు ఆర్ధిక విషయాలలో వీరప్ప పెరుమాళ్ ( అచ్యుత్ కుమార్) ఆదుకుంటూ ఉంటాడు. అతని కొడుకుని 'మురళి' గ్యాంగ్ దారుణంగా హత్య చేస్తుంది. తన కొడుకును ఎవరు హత్య చేశారు? ఎందుకోసం చేశారు? అనే విషయం వీరప్ప పెరుమాళ్ కి అర్థం కాదు. రెండేళ్ల తరువాత అతనికి తెలుస్తుంది .. ఈ హత్య వెనుక ముఖ్యమంత్రి మీనన్ ఉన్నాడని. దాంతో వీరప్ప పెరుమాళ్ ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తన కొడుకును చంపించిన మ్యుఖ్యమంత్రిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. 

ముఖ్యమంత్రి మీనన్ కి ఈ విషయం తెలిసిపోతుంది. తనని వీరప్ప పెరుమాళ్ చంపించేలోగా, తానే అతనిని అంతం చేయించాలని భావిస్తాడు. పోలీస్ ఆఫీసర్ సంపత్ రావు ద్వారా నలుగురు హంతకులను రంగంలోకి దింపుతాడు. అదే సమయంలో ఆ గ్యాంగ్ లో 'మణి' (ఆర్య) చేరతాడు. అతని లక్ష్యం కూడా వీరప్ప పెరుమాళ్ ను లేపేయడమే. వాళ్లంతా కలిసి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? 'మణి' ఎవరు? ఎక్కడి నుంచి వస్తాడు? వీరప్ప పెరుమాళ్ పై అతనికి ప్రతీకారం ఎందుకు?  తన పార్టీకి ఆర్ధిక సాయం చేసే వీరప్ప పెరుమాళ్ కొడుకును ముఖ్యమంత్రి ఎందుకు హత్య చేయిస్తాడు? అనేది మిగతా కథ. 

'అనంతన్ కాడు' అంటే .. 'అనంతమైన అడవి' అని అర్థం. అడవిలోని మృగాలు .. జంతువులు తమకంటే బలహీనంగా ఉన్నవాటిని చంపుకుని తింటూ ఉంటాయి. అయితే అక్కడి బలమైన మృగాలన్నీ కలిసినా అడవిని మాత్రం ఏమీ చేయలవు. అలాంటి ఒక అడవిలాంటి మనిషి చుట్టూ అల్లుకున్న కథ ఇది. మృగాలను పెంచిపోషించి .. ఒకదాని ప్రాణాలను మరొక దానితో తీయించి .. ఆ ఎరువుతో తాను ఏపుగా ఎదిగే అడవి కథ ఇది. 

స్వార్థపరుడైన ఒక ముఖ్యమంత్రి .. అవినీతిపరుడైన ఒక బడా వ్యాపారీ .. ఒక శాడిస్ట్ పోలీస్ ఆఫీసర్ .. తప్పనిసరి పరిస్థితులలో హత్యలు చేసే ఒక గ్యాంగ్ చుట్టూ దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ అయిన సంపత్ రావుపై ఒక ఆగంతకుడు దాడి చేయడం .. శ్రీలంక తమిళుడిగా ఉన్న వెట్రి వేల్ కుమరన్ ను తన సైన్యంతో శ్రీలంక కమాండర్ రౌండప్ చేయడం .. పైకి మ్యూజిక్ బ్యాండ్ నడుపుతూనే మురళి గ్యాంగ్ మర్డర్లు చేయడం వంటి ఆరంభ సన్నివేశాలతో దర్శకుడు అన్ని వైపుల నుంచి ఆసక్తిని రేపుతాడు. 

నేరమయ జీవితాన్ని గడుపుతున్న నలుగురు హంతకులను మరింత భయపెడుతూ, వాళ్లతో మరిన్ని హత్యలు చేయిస్తూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్. అనుకోకుండా ఆ గ్యాంగ్ లోకి హీరో ఎంట్రీ ఇవ్వడంతో ఈ కథ పుంజుకుంటుంది. అతను ఎంచుకున్న గమ్యం ఏమిటి? సాధించవలసిన లక్ష్యం ఏమిటి? అనే విషయాలు ఉత్కంఠను రేపుతూ ప్రేక్షకులను తమతో తీసుకుని వెళుతుంటాయి.

రాజకీయ నాయకులు .. పోలీస్ అధికారులు ఒకటైపోవడం, సామాన్యుల జీవితాలతో చెలగాటమాడటం వంటి కథలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఇది కూడా ఆ తరహా సినిమానే. కాకపోతే టేకింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆయా పాత్రలను .. వాటి స్వభావాలను మలచిన తీరు మెప్పిస్తుంది. ముఖ్యంగా స్నేహితుల మధ్య బాండింగ్ ఎమోషన్స్ వైపు నుంచి వర్కౌట్ చేసింది. రెజీనా .. నిఖిలా విమల్ వంటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వాళ్ల పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేదు. 

ఈ సినిమాలో ఎవరి పాత్ర హైలైట్ గా అనిపిస్తుంది .. ఎక్కువ మార్కులు కొట్టేస్తుందంటే, అందరూ చూపించేది సునీల్ వైపే. శాడిస్ట్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన నటన మెప్పిస్తుంది. ఇంతకుముందు సునీల్ విలన్ షేడ్స్ గల పాత్రలు చేసినప్పటికీ, ఆ వరుసలో ఈ పాత్ర ముందు ఉంటుందని నిస్సందేహంగా  చెప్పచ్చు. యువ ఫొటోగ్రఫీ .. అజనీశ్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం .. రోహిత్ ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి.  

మృగాలన్నీ కలిసినా అడవిని ఏమీ చేయలేకపోవచ్చు. కానీ అక్రమార్కులకు నెలవుగా మారిపోయినప్పుడు అడవికి కూడా ముప్పు తప్పదనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది.