ఆయ‌న‌తో బంధంపై మౌనంగా ఉండేందుకు రూ. 384 కోట్ల ఆఫర్.. మస్క్‌పై మాజీ భాగస్వామి సంచలన ఆరోపణలు!
Add ap7am to your home Screen

ఆయ‌న‌తో బంధంపై మౌనంగా ఉండేందుకు రూ. 384 కోట్ల ఆఫర్.. మస్క్‌పై మాజీ భాగస్వామి సంచలన ఆరోపణలు!

Elon Musk former partner Ashley St Clair claims 40 million dollar offer to stay silent about relationship
  • మస్క్‌తో సంబంధంపై మౌనంగా ఉండేందుకు తనకు భారీ ఆఫర్ ఇచ్చారన్న‌యాష్లీ క్లెయిర్  
  • దాదాపు 40 మిలియన్ డాల‌ర్ల‌ ఒప్పందాన్ని ప్రతిపాదించారని 'న్యూయార్క్ టైమ్స్‌'కు వెల్లడి
  • కఠిన నిబంధనల కారణంగా ఆ ఒప్పందాన్ని తిరస్కరించినట్లు స్పష్టీక‌ర‌ణ‌
  • ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఎలాన్ మస్క్ 
  • యాష్లీకి అబద్ధాలు చెప్పే చరిత్ర ఉందని వ్యాఖ్య
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై ఆయన మాజీ భాగస్వామి, తన పిల్లలలో ఒకరికి తల్లి అయిన యాష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలు చేశారు. తమ మధ్య ఉన్న సంబంధం గురించి ఎప్పటికీ మౌనంగా ఉండేందుకు తనకు దాదాపు 40 మిలియన్ డాల‌ర్ల‌ (సుమారు రూ. 384 కోట్లు) విలువైన ఆర్థిక ఒప్పందాన్ని ప్రతిపాదించారని ఆమె ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఎలాన్ మస్క్ పూర్తిగా ఖండించారు.

అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'ది న్యూయార్క్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాష్లీ ఈ వివరాలను వెల్లడించారు. 'గోప్యతా ఒప్పందం' (Non-Disclosure Agreement - NDA)లో భాగంగా తనకు $15 మిలియన్లు ఒకేసారి, ఆ తర్వాత 21 ఏళ్లపాటు నెలకు $100,000 చొప్పున చెల్లిస్తామని ప్రతిపాదించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ లెక్కన మొత్తం ఆఫర్ విలువ $40.2 మిలియన్లకు చేరుకుంటుంది. 

ఈ ఒప్పందంపై సంతకం చేస్తే మస్క్‌తో తన సంబంధం గురించి జీవితాంతం ఎవరితోనూ మాట్లాడకూడదని, చివరికి తన కుటుంబసభ్యులతో కూడా చర్చించరాదని నిబంధన విధించినట్లు తెలిపారు. ఈ నిబంధనలు తన వారసులకు కూడా వర్తిస్తాయని ఒప్పందంలో పేర్కొన్నారని ఆమె వివరించారు.

2024లో తాను బిడ్డకు జన్మనిచ్చిన రెండు నెలల తర్వాత మస్క్ ఆర్థిక వ్యవహారాల మేనేజర్‌గా భావిస్తున్న జారెడ్ బిర్చాల్ 'సిగ్నల్' యాప్ ద్వారా ఈ ప్రతిపాదన పంపారని యాష్లీ తెలిపారు. అయితే, ఈ నిబంధనలు, ముఖ్యంగా తన పిల్లల విషయంలో అంగీకారయోగ్యంగా లేవని భావించి తాను ఆ ఒప్పందాన్ని తిరస్కరించినట్లు ఆమె స్పష్టం చేశారు.

ఖండించిన మస్క్ 
మరోవైపు యాష్లీ చేసిన ఆరోపణలను ఎలాన్ మస్క్ తీవ్రంగా తోసిపుచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఆయన స్పందిస్తూ.. "ఆమెకు అలాంటి ఆఫర్ ఎప్పుడూ ఇవ్వలేదు. తప్పుడు ఆరోపణలు చేయడం ఆమెకు అలవాటు" అని పేర్కొన్నారు. 

ప్రముఖ దర్శకుడు అలెక్స్ గిబ్నీ రూపొందించిన 'మస్క్' అనే డాక్యుమెంటరీలో కూడా యాష్లీ కనిపిస్తారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. అయితే, యాష్లీ చెబుతున్న నిర్దిష్ఠ‌ ఒప్పంద నిబంధనలకు మస్క్ వ్యక్తిగతంగా ఆమోదం తెలిపినట్లు నిర్ధారణ కాలేదని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Advertisement
Elon Musk
Ashley St Clair
Elon Musk Hush Money Allegations
Non Disclosure Agreement
Tesla CEO Controversy
Jared Birchall

More Telugu News