స్టార్‌లింక్‌ వివాదం.. మస్క్‌కు వెంబు దిమ్మతిరిగే సమాధానం!
Add ap7am to your home Screen

స్టార్‌లింక్‌ వివాదం.. మస్క్‌కు వెంబు దిమ్మతిరిగే సమాధానం!

Starlink Controversy Sridhar Vembu Gives Strong Reply to Elon Musk
  • జియోతో డేటా ధరలు తగ్గాయని స్పష్టీకరణ
  • అమెరికాలో చైనా ఈవీల నుంచి టెస్లాకు రక్షణ లభిస్తోందని వ్యాఖ్య
  • భారత స్టార్టప్‌లు తక్కువ ధరతో రాకెట్లు తయారు చేస్తున్నాయని వెల్లడి
  • ఇవి స్సేస్‌ఎక్స్‌కు పోటీ ఇస్తాయని వ్యాఖ్య
టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు గట్టిగా బదులిచ్చారు. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీని ఉద్దేశించి మస్క్‌ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై స్పందిస్తూ.. భారత్‌లో తక్కువ ధరలకే మొబైల్‌ డేటా, మందులు, డిజిటల్‌ చెల్లింపులు అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. ఇవన్నీ సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ‘ఇవిగో నిజాలు ఎలాన్‌’ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా మస్క్‌ విమర్శలకు సమాధానమిచ్చారు.

భారత్‌లో మొబైల్‌ డేటా ధరలు తగ్గడంలో అంబానీ తీసుకొచ్చిన జియో కీలక పాత్ర పోషించిందని వెంబు పేర్కొన్నారు. దేశంలో ప్రయాణించేటప్పుడు స్థానిక వైఫైకి బదులుగా తన ఫోన్‌ డేటానే ఎక్కువగా ఉపయోగిస్తానని చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా లభిస్తుండటంతో చాలామంది రెండు సిమ్‌లు వాడుతున్నారని వివరించారు.

అమెరికా మార్కెట్‌ విషయంలోనూ వెంబు మస్క్‌ను ప్రశ్నించారు. చైనా ఎలక్ట్రిక్‌ వాహనాల పోటీ నుంచి అమెరికా మార్కెట్‌లో టెస్లాకు రక్షణ లభిస్తోందని అభిప్రాయపడ్డారు. పోటీ ఎక్కువగా ఉంటే అమెరికాలో ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అన్నారు. భారత్‌లో సామాన్యులకు తక్కువ ధరలకు సేవలు అందేలా పోటీతో కూడిన ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. భారత స్టార్టప్‌లు తక్కువ ఖర్చుతో రాకెట్లు తయారు చేసే దిశగా సాధిస్తున్న పురోగతిని కూడా ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇవి స్పేస్‌ఎక్స్‌కు పోటీగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

అసలు మస్క్‌ ఎందుకు అంబానీపై విమర్శలు చేశారు? భారత్‌లో స్టార్‌లింక్‌ సేవల ప్రారంభానికి అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. ‘భారత్‌కు నిజమైన బాస్‌ అంబానీ అని తెలియదు.. క్షమించండి’ అంటూ మస్క్‌ వ్యంగ్యంగా పోస్ట్‌ చేశారు. స్టార్‌లింక్‌ ను అడ్డుకుని గుత్తాధిపత్యాన్ని కొనసాగించాలని అంబానీ భావిస్తున్నారని ఆరోపించారు.

మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ అందించడం, ప్రకృతి విపత్తుల సమయంలో కమ్యూనికేషన్‌ సేవలను పునరుద్ధరించడం ద్వారా స్టార్‌లింక్‌ ఉపయోగపడుతుందని మస్క్‌ వాదించారు. అయితే భారత్‌లో వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు స్టార్‌లింక్‌ ఇంకా కొన్ని నియంత్రణపరమైన అనుమతులు పొందాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, జియో కూడా ఉపగ్రహ ఇంటర్నెట్‌ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. భారత్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2026లో సుమారు 1,600 లో-ఎర్త్‌ ఆర్బిట్‌ ఉపగ్రహాలు, 23 గ్రౌండ్‌ స్టేషన్లతో సేవలు అందించే ప్రణాళికను ప్రకటించింది. మారుమూల గ్రామాలు, ద్వీపాలు, సరిహద్దు ప్రాంతాలకు ఇంటర్నెట్‌ అందించడం దీని లక్ష్యం. స్టార్‌లింక్‌, జియోతో పాటు భారతీ ఎయిర్‌టెల్‌ మద్దతున్న యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌ కూడా అనుమతుల ప్రక్రియలో ఉన్నాయని భారత ప్రభుత్వం తెలిపింది.
Advertisement
Sridhar Vembu
Elon Musk
Mukesh Ambani
Starlink Controversy
Reliance Jio
Satellite Internet India

More Telugu News