ఈసారి ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి వ‌స్తుందా?.. నిపుణులు చెబుతుంది ఇదే..!

ఈసారి ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి వ‌స్తుందా?.. నిపుణులు చెబుతుంది ఇదే..!

Donald Trump Nobel Peace Prize 2026 chances explained by experts
  • ట్రంప్‌కు 2026 నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశాలు తక్కువ
  • ఇరాన్‌తో అమెరికా యుద్ధంలో ఉండటమే ప్రధాన కారణమని నిపుణుల అంచనా
  • గతేడాది విజేత తన పతకాన్ని ట్రంప్‌కు ఇవ్వడం వివాదాస్పదం కావడమూ ఓ కారణం
  • అక్టోబర్ 9న ప్రకటించనున్న పురస్కారానికి ప్రత్యామ్నాయంగా పరిశీలనలో పలు పేర్లు 
  • ఈసారి వివాదరహిత ఎంపికకే నోబెల్ కమిటీ మొగ్గు చూపవచ్చని విశ్లేషణ
ప్రతిష్ఠాత్మక 2026 నోబెల్ శాంతి బహుమతి రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పటికీ, ఆయనకు ఈ పురస్కారం దక్కే అవకాశాలు చాలా తక్కువని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్‌తో అమెరికా ప్రస్తుతం యుద్ధంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని వారు విశ్లేషిస్తున్నారు. ఈ అవార్డు విజేతను అక్టోబర్ 9న నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించనుంది.

ట్రంప్ పేరును కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ దేశాల నేతలు నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. అయినప్పటికీ, ఆయన గెలుపుపై విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేయడం లేదు. ఆస్లో శాంతి పరిశోధన సంస్థ తాత్కాలిక డైరెక్టర్ హాకోన్ గెర్లోవ్ మాట్లాడుతూ, ఒక దేశాధినేత యుద్ధంలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఆయనకు శాంతిని ప్రోత్సహించే పురస్కారం ఇవ్వడం అసాధారణమని పేర్కొన్నారు. ఇది నోబెల్ బహుమతి మూల‌ ఉద్దేశానికే విరుద్ధంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

గతేడాది నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో, ఆ తర్వాత తన పతకాన్ని ట్రంప్‌కు బహూకరించడం తీవ్ర వివాదాస్పదమైంది. అప్పట్లో ఆ అవార్డు కోసం ట్రంప్ లాబీయింగ్ చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామం ఈ ఏడాది నోబెల్ కమిటీ నిర్ణయంపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి బాహ్య ఒత్తిళ్లకు, వివాదాలకు తావులేని వ్యక్తిని లేదా సంస్థను ఎంపిక చేసేందుకే కమిటీ మొగ్గు చూపవచ్చని అంచనా వేస్తున్నారు.

ఒకవేళ ట్రంప్‌ను కాకపోతే, పోప్ లియో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ), అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) లేదా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సెస్కా అల్బనీస్ వంటి వారికి ఈ పురస్కారం దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వీరితో పాటు సుడాన్‌లోని 'ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్స్' వంటి మానవతా సంస్థలను కూడా కమిటీ పరిశీలించవచ్చని సూచిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలు, సంస్థాగత విలువులకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
Advertisement
Donald Trump
Nobel Peace Prize
Nobel Committee
Peace Prize Nominations
International Court of Justice
US Iran conflict

More Telugu News