ప్రాణాలు కాపాడే కొత్త విధానం.. బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులకు ఇంటిగ్రేటెడ్ ట్రీట్‌మెంట్

ప్రాణాలు కాపాడే కొత్త విధానం.. బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులకు ఇంటిగ్రేటెడ్ ట్రీట్‌మెంట్

New Method to Save Lives Integrated Treatment for BP Sugar and Kidney Diseases
  • బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలకు వేర్వేరుగా కాకుండా ఉమ్మడి చికిత్స
  • 'కార్డియోవాస్కులర్‌-కిడ్నీ-మెటబాలిక్‌ సిండ్రోమ్'గా గుర్తింపు
  • దేశవ్యాప్తంగా 50 మంది వైద్య నిపుణులు రూపొందించిన 'వారణాసి డిక్లరేషన్ 2026'
  • భారతీయుల శరీర తత్వానికి అనుగుణంగా కొత్త వైద్య ప్రమాణాలు ప్రతిపాదన
  • కీలక ఔషధాలను నిత్యావసర జాబితాలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), కిడ్నీ జబ్బులు... ఈ మూడింటినీ వేర్వేరు సమస్యలుగా చూస్తూ, వేర్వేరు వైద్యులతో చికిత్స చేయించుకోవడం ప్రమాదకరమని భారత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మూడు వ్యాధులను కలిపి ఒకే సిండ్రోమ్‌గా పరిగణించి, సమగ్ర చికిత్స అందించాలని సూచిస్తున్నారు. ఈ మేరకు దేశంలోని వివిధ విభాగాలకు చెందిన 50 మంది ప్రముఖ వైద్యులు రూపొందించిన ‘వారణాసి డిక్లరేషన్ 2026’ పేరుతో ఒక విధాన పత్రాన్ని విడుదల చేశారు. ఈ ప్రతిపాదనలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తూ, ప్రతిష్ఠాత్మక వైద్య జర్నల్ 'ది లాన్సెట్ రీజినల్ హెల్త్ - సౌత్‌ఈస్ట్ ఆసియా'లో ఇది ప్రచురితమైంది.

సమగ్ర చికిత్స ఎందుకు అవసరం?
ప్రస్తుతం మన దేశంలో బీపీకి జనరల్ ఫిజీషియన్, షుగర్‌కు ఎండోక్రైనాలజిస్ట్, కిడ్నీ సమస్యలకు నెఫ్రాలజిస్ట్ వద్దకు వెళ్లే విధానం అమల్లో ఉంది. అయితే బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, వీటిని కలిపి 'కార్డియోవాస్కులర్‌-కిడ్నీ-మెటబాలిక్‌' (సీకేఎం) సిండ్రోమ్‌గా చూడాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ మూడు సమస్యలూ ఉన్నవారు పదేళ్లలోపు గుండె జబ్బులతో మరణించే ప్రమాదం 30 నుంచి 50 శాతం వరకు అధికంగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఏటా దాదాపు 25 లక్షల మంది ఇలాంటి సమస్యలతో అకాల మరణం చెందుతున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వీరికి అవసరమైన మూడు కీలక ఔషధాలను (రెనిన్‌-యాంజియోటెన్సిన్‌ బ్లాకర్స్‌, ఎస్జీఎల్‌టీ2 ఇన్హిబిటర్లు, స్టాటిన్లు) కలిపి వాడుతున్న రోగులు 20 శాతం కన్నా తక్కువ ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

భారతీయుల కోసం కొత్త ప్రమాణాలు
పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే భారతీయుల శరీర తత్వం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది 'థిన్-ఫ్యాట్' రకానికి చెంది ఉంటారు. అంటే, పైకి సన్నగా కనిపించినా, అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దీనివల్ల చిన్న వయసులోనే గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. అందుకే, పాశ్చాత్య దేశాల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కొలతలు మనకు సరిపోవని నిపుణులు తేల్చారు. భారతీయులకు బీఎంఐ 23 దాటితే అధిక బరువుగా, 27.5 దాటితే స్థూలకాయంగా పరిగణించాలని సూచించారు. పురుషుల్లో నడుము చుట్టుకొలత 90 సెం.మీ, స్త్రీలలో 80 సెం.మీ మించకూడదని పేర్కొన్నారు. అమెరికా రిస్క్ కాలిక్యులేటర్లకు బదులుగా, మన దేశ ప్రజల సమాచారంతో 'ఇండియా-ప్రివెంట్' పేరుతో ప్రత్యేక రిస్క్ అసెస్‌మెంట్ వ్యవస్థను రూపొందించాలని ప్రతిపాదించారు.

ప్రభుత్వానికి కీలక సూచనలు
శరీరంలోని కీలక అవయవాలను కాపాడే ఎస్జీఎల్‌టీ2 ఇన్హిబిటర్లు, జీఎల్‌పీ-1 రిసెప్టర్ అగోనిస్టుల వంటి అత్యాధునిక ఔషధాలను వెంటనే జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాలో చేర్చాలని కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వీటిని జనరిక్ రూపంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు కూడా అందుబాటులోకి తేవాలని కోరింది.

ఈ కొత్త విధానాన్ని దేశవ్యాప్తంగా మూడు దశల్లో అమలు చేయాలని ప్రతిపాదించారు.
మొదటి దశ: ఆయుష్మాన్ భారత్ వెల్‌నెస్ కేంద్రాల్లో 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స ప్రారంభించాలి.
రెండో దశ: జిల్లా ఆసుపత్రుల్లో కార్డియాలజీ, నెఫ్రాలజీ వైద్యుల సమన్వయంతో 'ఇంటిగ్రేటెడ్ సీకేఎం క్లినిక్‌లు' ఏర్పాటు చేయాలి.
మూడో దశ: బోధనాసుపత్రుల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, నాణ్యత తనిఖీలు చేపట్టాలి.

ఇందుకోసం 'ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్' (ఆభా) ఆధారిత 'సీకేఎం పేషెంట్ పాస్‌పోర్టు'ను ప్రవేశపెట్టాలని, దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో 50 వేల మంది రోగులతో 'ఇండియా సీకేఎం రిజిస్ట్రీ'ని ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం డిజిటల్ బీపీ మిషన్, గ్లూకోమీటర్ వంటి చౌక పరికరాలతో పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
Advertisement
Varanasi Declaration 2026
CKM Syndrome
Diabetes and Hypertension Treatment
Kidney Disease Prevention India
Integrated Medical Care
Indian BMI Standards

More Telugu News