రామాయపట్నం రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామాయపట్నం రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Ramayapatnam Refinery receives green signal from Central Government
  • రూ.1.03 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణం
  • ఏటా 9 మిలియన్ టన్నుల పెట్రో ఉత్పత్తుల తయారీ లక్ష్యం
  • నిర్మాణ, నిర్వహణ దశల్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు
  • ప్రాజెక్టులో గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన జోన్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు కీలక అడుగు పడింది. ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) పచ్చజెండా ఊపుతూ సిఫారసు చేసింది. ఈ అనుమతితో ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రారంభానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

సుమారు రూ.1,03,408 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రామాయపట్నం పోర్టు సమీపంలో దాదాపు 5,200 ఎకరాల భూమిని కేటాయించారు. ఏడాదికి 9 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తారు. ఇందులో 5.4 మిలియన్ టన్నుల పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వంటి రవాణా ఇంధనాలతో పాటు, 3.2 మిలియన్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేయాలన్నది లక్ష్యం.

పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రాజెక్టులో పెద్దపీట వేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు ప్రాంగణంలో 30 శాతం, అంటే సుమారు 1,563 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనాన్ని (గ్రీన్ బెల్ట్) అభివృద్ధి చేయనున్నారు. పర్యావరణ నిర్వహణ ప్రణాళిక కోసం ప్రత్యేకంగా రూ.3,022 కోట్లు కేటాయించడం గమనార్హం. వీటితో పాటు గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన జోన్లు, రామాయపట్నం పోర్టుతో అనుసంధానించిన మెరైన్ క్రూడ్ ఆయిల్ టెర్మినల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయి.

ఈ రిఫైనరీ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారనున్నాయని, దక్షిణ భారతదేశంలోనే ఇది ఒక ప్రధాన ఇంధన, పెట్రోకెమికల్ హబ్‌గా ఎదుగుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో వేలాది మందికి, ఆ తర్వాత నిర్వహణ దశలోనూ వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. అనుమతుల ప్రక్రియ ఖరారైన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు బీపీసీఎల్ సన్నాహాలు చేస్తోంది.
Advertisement
BPCL
Ramayapatnam Refinery
Andhra Pradesh
Petrochemical Complex
Nellore
Environment Clearance

More Telugu News