పరుగులు వద్దు.. నెమ్మదిగా కదిలితే చాలు! తై చీతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

పరుగులు వద్దు.. నెమ్మదిగా కదిలితే చాలు! తై చీతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

Tai Chi Health Benefits Slow Movement Over Running
  • తై చీ పురాతన చైనా యుద్ధకళ
  • ఇప్పుడు ఆరోగ్య సాధనగా మారిన తై చీ
  • శ్వాస, కదలికల సమన్వయమే దీని ప్రత్యేకత
  • కీళ్లపై తక్కువ ఒత్తిడి
  • భారత్‌లో తై చీ వాకింగ్‌ ట్రెండ్‌
ఉదయం పార్కులోకి వెళ్లగానే వేగంగా నడిచేవాళ్లు, పరుగులు తీసేవాళ్లు కనిపించడం సహజం. కానీ ఇప్పుడు అదే పార్కుల్లో కొందరు మాత్రం చాలా నెమ్మదిగా కదులుతూ కనిపిస్తున్నారు. చేతులు గాల్లో అలలలా కదులుతుంటాయి. అడుగులు సుతారంగా పడుతుంటాయి. శ్వాసకు తగ్గట్టుగా శరీరం కదులుతుంది. చూస్తే యోగా చేస్తున్నారేమో అనిపిస్తుంది.

కానీ అది తై చీ. ఒకప్పుడు యుద్ధకళగా ఉన్న ఈ పురాతన సాధన ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే సులభమైన వ్యాయామంగా మారింది. ముఖ్యంగా కీళ్లపై ఎక్కువ ఒత్తిడి లేకపోవడంతో వృద్ధుల్లోనూ దీనికి ఆదరణ పెరుగుతోంది.

తై చీ అంటే ఏంటి?
తై చీ చైనాలో పుట్టిన పురాతన యుద్ధకళ. కాలక్రమంలో ఇది పోరాట విద్య నుంచి ఆరోగ్య సాధనగా రూపాంతరం చెందింది. ఇందులో వేగం కంటే శరీర కదలికలు, శ్వాస, ఏకాగ్రతకు ప్రాధాన్యం ఉంటుంది. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు శరీరాన్ని నెమ్మదిగా, సాఫీగా మార్చుకుంటూ సాధన చేస్తారు. శరీర బరువును ఒక కాలు నుంచి మరో కాలుకు మెల్లగా మార్చడం ఇందులో ముఖ్యమైన భాగం.

తై చీలోని కదలికలు గుర్రం, పాము, సింహం వంటి జంతువుల సహజ భంగిమలను పోలి ఉంటాయి. లోతైన శ్వాసతో శరీర కదలికలను సమన్వయం చేస్తారు. అందుకే ఇది శరీరంతో పాటు మనసుపైనా దృష్టి పెట్టే సాధనగా చెబుతారు.

కీళ్లపై ఒత్తిడి తక్కువ
తై చీ ప్రత్యేకత దాని నెమ్మదైన కదలికల్లోనే ఉంది. తీవ్రమైన వ్యాయామాల్లా ఒక్కసారిగా శరీరంపై భారం పడదు. కీళ్లపై ఒత్తిడి తక్కువగా ఉండటంతో వృద్ధులు కూడా సులభంగా సాధన చేయగలరు. కదలికలు, సమతుల్యత, శరీర సమన్వయం మెరుగుపడేందుకు ఇది ఉపయోగపడుతుంది. క్రమంగా సాధన చేస్తే శరీర భంగిమపై అవగాహన పెరుగుతుంది.

శ్వాసతో మనసుకు ప్రశాంతత
తై చీలో కదలికకు శ్వాసను జోడించడం ముఖ్యమైన విషయం. శ్వాసను గమనిస్తూ నెమ్మదిగా కదలడం వల్ల మనసు ఒకే విషయంపై నిలబడేలా సాధన అవుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. బిగుసుకుపోయిన కండరాలను సడలించడంతో శరీరం తేలికగా అనిపిస్తుంది. ప్రశాంతమైన మనసు, శరీరంపై ఎక్కువ అవగాహన కలగడం దీని మరో ప్రత్యేకత.

భారత్‌లో ఎందుకు వైరల్‌?
ఇటీవల పార్కులు, సోషల్‌ మీడియాల్లో తై చీ వాకింగ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. అధిక తీవ్రతతో చేసే వ్యాయామాలు, ఎక్కువ దూరం వేగంగా నడవడం కష్టంగా అనిపించే వారికి ఇది ప్రత్యామ్నాయంగా మారుతోంది. ముఖ్యంగా వయసు పెరిగిన తర్వాత చురుగ్గా ఉండాలనుకునేవారు తై చీ వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ తీవ్రతతో చేయగలగడం, ప్రత్యేక పరికరాలు అవసరం లేకపోవడం కూడా దీని ఆదరణకు కారణం.

దీన్ని చాలామంది ‘చైనీస్‌ యోగా’గా పిలుస్తున్నారు. అయితే యోగా, తై చీ వేర్వేరు సంప్రదాయాలు. రెండింటిలోనూ శ్వాస, శరీరం, మనసు మధ్య సమన్వయానికి ప్రాధాన్యం ఉండటం వల్ల కొంత పోలిక కనిపిస్తుంది.

భారతీయ సంప్రదాయంతో పోలిక ఏంటి?
భారత్‌లో ప్రాచీన కాలం నుంచి మార్షల్‌ ఆర్ట్స్‌, శరీర సాధనలకు ప్రత్యేక స్థానం ఉంది. కేరళకు చెందిన మైపయట్టు వంటి సంప్రదాయాల్లోనూ శరీర కదలికలు, శ్వాస, సమతుల్యతకు ప్రాధాన్యం ఉంటుంది. అందుకే తై చీ సాధనలోని కొన్ని అంశాలు భారతీయ శారీరక సాధనలను గుర్తుకు తెస్తాయి. ఇటీవల భారత్‌లో తై చీపై ఆసక్తి పెరగడంతో వర్క్‌షాపులు కూడా జరుగుతున్నాయి.

వయసుతో సంబంధం లేని సాధన
శరీరాన్ని అలసిపోయేలా కాకుండా.. అర్థం చేసుకునేలా చేయడమే తై చీ ప్రత్యేకత. కదలికలు నెమ్మదిగా సాగుతాయి. శ్వాస సాఫీగా కొనసాగుతుంది. శరీరం, మనసు ఒకే లయలోకి వచ్చేలా సాధన సాగుతుంది. అందుకే రోజువారీ ఒత్తిడిలో కాస్త ప్రశాంతత కోరుకునేవారి నుంచి వయసు పైబడిన వారి వరకు తై చీ ఆకట్టుకుంటోంది. వేగమే ఆరోగ్యం అనే రోజుల్లో.. నెమ్మదిగా కదలడమే కొత్త వెల్‌నెస్‌ ట్రెండ్‌గా మారుతోంది.
Advertisement
Tai Chi
Health benefits
Chinese martial arts
Low impact exercise
Tai Chi walking
Stress relief

More Telugu News