ఓటు హక్కును తొలగించడం అంటే ఆత్మను తీసేయడమే.. సుప్రీంకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు

ఓటు హక్కును తొలగించడం అంటే ఆత్మను తీసేయడమే.. సుప్రీంకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు

Removing the right to vote is like removing the soul says Supreme Court judge
  • కోట్లాది మందిని ఓటుకు దూరం చేయడంపై జస్టిస్‌ భుయాన్‌ అభ్యంతరం
  • పౌరులను రెండు వర్గాలుగా విభజించలేమని స్పష్టీకరణ
  • ఓటు హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని వెల్లడి
  • పేర్ల తొలగింపునకు ముందు నోటీసు, విచారణ తప్పనిసరి
  • ఓటు హక్కును పౌరసత్వం నుంచి వేరు చేయలేమని వ్యాఖ్య
దేశంలో కోట్లాది మంది పౌరులను ఓటు హక్కుకు దూరం చేసే ఏ ప్రక్రియ అయినా రాజ్యాంగ విరుద్ధమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు పౌరులను సొంత దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చడమేనని, ఇది రాజ్యాంగంపై నేరుగా దాడి చేయడమేనని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎంతటి కారణాలు చూపినా ఇలాంటి చర్యలను సమర్థించలేమని అన్నారు.

హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన 19వ జస్టిస్‌ బోధ్‌రాజ్‌ సావ్నీ స్మారక మూట్‌ కోర్టు పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో పౌరులందరికీ ఓటు హక్కు ఉండాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని గుర్తుచేశారు. ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ పౌరులను రెండు వర్గాలుగా విభజించడానికి రాజ్యాంగం అంగీకరించదని పేర్కొన్నారు.

కోట్లాది మందిని ఓటు హక్కుకు దూరం చేసే ప్రక్రియ రాజ్యాంగంలోని 14వ అధికరణం కల్పించిన సమానత్వ హక్కును, 326వ అధికరణం నిర్దేశించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఉల్లంఘించడమేనని జస్టిస్‌ భుయాన్‌ అన్నారు. రాజ్యాంగానికి మించిన వారు ఎవరూ లేరని, ఇలాంటి చర్యలను ఏ అధికార సంస్థ చేపట్టలేదని, ఏ న్యాయస్థానమూ సమర్థించలేదని స్పష్టం చేశారు.

ఓటు హక్కు అనేది దేశ స్వాతంత్య్ర పోరాటంతో ముడిపడిన హక్కు అని ఆయన గుర్తుచేశారు. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని, 326వ అధికరణాన్ని ఏమాత్రం మార్చడానికి వీల్లేదని పేర్కొన్నారు. మరణించిన ఓటరు మినహా, మరే ఇతర వ్యక్తి పేరునైనా ఓటర్ల జాబితా నుంచి తొలగించే ముందు నోటీసు ఇవ్వాలని, తన వాదన వినిపించే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. పౌరసత్వం నుంచి ఓటు హక్కును వేరు చేయడం శరీరం నుంచి ఆత్మను తీసివేయడంతో సమానమని వ్యాఖ్యానించారు.

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భారీగా పేర్లు తొలగిస్తున్నారన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జస్టిస్‌ భుయాన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి.
Advertisement
Justice Ujjal Bhuyan
Supreme Court of India
Right to Vote
Voter List Deletion
Article 326
NALSAR University

More Telugu News