ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా దాడి.. ఒకరి మృతి

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా దాడి.. ఒకరి మృతి

Russia attacks Indian pharma company in Ukraine one dead
  • ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి
  • సుమీ నగరంలోని కుసుమ్ గ్రూప్ ప్లాంట్ దాదాపు ధ్వంసం
  • దాడిలో ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
  • దాదాపు రూ.400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ, ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీపై భీకర దాడి జరిగింది. రష్యా ప్రయోగించిన డ్రోన్లు సుమీ నగరంలోని 'కుసుమ్ గ్రూప్'కు చెందిన ఫార్మా ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెంద‌గా, పలువురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో ప్లాంట్‌లోని ప్రధాన నిర్మాణం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. డ్రోన్లు దాడి చేసిన ప్రాంతం నుంచి భారీగా పొగ కమ్ముకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ దాడి వల్ల సుమారు రూ.400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

విశేషమేమిటంటే.. రెండేళ్లకు పైగా యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఈ ప్లాంట్ నిరంతరాయంగా ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడితో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.

భారతీయుడైన రాజీవ్ గుప్తా నేతృత్వంలో కుసుమ్ గ్రూప్ నడుస్తోంది. ఈ సంస్థ 1994లో భారతీయ ఔషధాలను ఉక్రెయిన్‌కు ఎగుమతి చేసే డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభమై, ఆ తర్వాత సొంత బ్రాండ్లను మార్కెటింగ్ చేసింది. 2009లో సుమీ నగరంలో తయారీ ప్లాంట్‌ను స్థాపించింది. ఈ గ్రూప్ ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ వంటి 9కి పైగా దేశాలకు 50 రకాల జనరిక్ ఔషధాలను విక్రయిస్తోంది.

గత కొంతకాలంగా రష్యా.. చవకైన, వేగవంతమైన షాహెద్ డ్రోన్లతో ఉక్రెయిన్‌పై నిరంతరం దాడులు చేస్తోంది. ఈ డ్రోన్లను అడ్డుకోవడం ఉక్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారింది. 

ఇదే సమయంలో, ఉక్రెయిన్ కూడా దేశీయంగా తయారుచేసిన 'ఎఫ్‌పీ-7' బాలిస్టిక్ క్షిపణిని ఈ వారంలో తొలిసారిగా ప్రయోగించినట్లు ప్రకటించింది. దీని పరిధి సుమారు 250 కిలోమీటర్లు కావడం గమనార్హం.
Advertisement
Kusum Group
Russia Ukraine War
Indian pharma company attack
Sumy drone strike
Rajiv Gupta Kusum Pharma
Indian pharmaceutical plant Ukraine

More Telugu News