15 ఏళ్ల భారత బ్యాటర్‌ను హేళన చేసిన పాక్ ఆల్‌రౌండర్.. సైమ్ అయ్యూబ్‌కు బుద్ధుందా? అంటూ సొంత దేశ మాజీ క్రికెటర్ ఫైర్!

15 ఏళ్ల భారత బ్యాటర్‌ను హేళన చేసిన పాక్ ఆల్‌రౌండర్.. సైమ్ అయ్యూబ్‌కు బుద్ధుందా? అంటూ సొంత దేశ మాజీ క్రికెటర్ ఫైర్!

Saim Ayub mocked 15 year old Indian batter Kamran Akmal slams Pakistan all rounder
  • ఆసియా క్రీడల ఫైనల్‌లో పాక్ ఆటగాడి దురుసు ప్రవర్తన
  • 15 ఏళ్ల భారత ఓపెనర్‌కు వెక్కిరింత సెండాఫ్
  • సోషల్ మీడియా కోసమే ఇలాంటి పిచ్చి పనులు అన్న‌ కమ్రాన్ అక్మల్
  • అదే ఓవర్‌లో ప్రతీకారం తీర్చుకున్న భారత బ్యాటర్లు
  • స్వర్ణం గెలిచి సత్తా చాటిన టీమిండియా
ఆసియా క్రీడలు 2026 క్రికెట్ ఫైనల్‌లో భారత యువ బ్యాటర్ పట్ల పాకిస్థాన్ ఆల్‌రౌండర్ సైమ్ అయ్యూబ్ ప్రవర్తించిన తీరుపై ఆ దేశ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 15 ఏళ్ల కుర్రాడిని ఔట్ చేసి, చిన్నపిల్లాడికి జోల పాడినట్టు సైగలు చేయడంపై మండిపడ్డాడు. ఆటపై కాకుండా సోషల్ మీడియాలో గుర్తింపు కోసం పాకులాడితే ఇలాగే ఉంటుందని చురకలంటించాడు.

నిన్న‌ భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన స్వర్ణ పతక పోరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని (15) సైమ్ అయ్యూబ్ ఔట్ చేశాడు. 9 బంతుల్లో 15 పరుగులు చేసిన వైభవ్ పెవిలియన్‌కు వెళ్తుండగా, అయ్యూబ్ అతని వయసును హేళన చేస్తూ.. చిన్న పిల్లాడిని ఊపుతున్నట్టు చేతులతో సైగలు చేశాడు. ఈ చర్యపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై ఓ స్పోర్ట్స్ షోలో కమ్రాన్ అక్మల్ ఘాటుగా స్పందించాడు. "ఇలాంటివి ఎప్పటినుంచో జరుగుతున్నాయి. మైదానంలో మా ప్రదర్శన ఏమీ గొప్పగా లేదు, కానీ సోషల్ మీడియా కోసం ఇలాంటి పనులు చేస్తున్నాం. యాజమాన్యం దీని గురించి ఆలోచించాలి. ఇది అంతర్జాతీయ క్రికెట్. ప్రత్యర్థి వయసు 13, 14, 15 ఏదైనా కావచ్చు, కానీ అతను దేశం తరఫున ఆడుతున్నాడు. సైమ్ అయ్యూబ్ చిన్నపిల్లాడు కాదు. తన ఆటపై దృష్టి పెట్టాలి" అని అక్మల్ హితవు పలికాడు.

అయితే, అయ్యూబ్ వెక్కిరింతలకు అదే ఓవర్‌లో భారత బ్యాటర్లు గట్టి సమాధానం ఇచ్చారు. క్రీజులో ఉన్న‌ అభిషేక్ శర్మ.. అయ్యూబ్ బౌలింగ్‌లోనే ఓ భారీ సిక్సర్, రెండు బౌండరీలు బాది ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించి, పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. దీంతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా అయ్యూబ్ చేష్టలు కేవలం అనాలోచిత చర్యలుగా, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా మిగిలిపోయాయి.
Advertisement
Saim Ayub
Vaibhav Suryavanshi
Kamran Akmal
Asian Games 2026
India vs Pakistan Cricket
Saim Ayub Mocking Gesture

More Telugu News