వార్తలకు భయపడ్డ దొంగలు.. చోరీ చేసిన పట్టుచీరలు కొరియర్‌లో వాపస్!

వార్తలకు భయపడ్డ దొంగలు.. చోరీ చేసిన పట్టుచీరలు కొరియర్‌లో వాపస్!

Thieves scared of news return stolen silk sarees via courier
  • తమిళనాడు వ్యాపారి షాపులో 32 పట్టుచీరల చోరీ
  • లగ్జరీ కారులో వచ్చి కొనుగోలు పేరుతో అపహరణ
  • మీడియాలో వార్తలు రావడంతో భయపడిన దొంగలు
  • కొరియర్ ద్వారా చోరీ సొత్తును వ్యాపారికి తిప్పి పంపిన వైనం
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తమిళనాడులో ఓ వింత చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పట్టుచీరల దుకాణంలో అపహరించిన ఖరీదైన చీరలను, వార్తలకు భయపడి దొంగలు మళ్లీ కొరియర్ ద్వారా యజమానికే తిప్పి పంపారు. ఈ అనూహ్య ఘటన తిరువణ్ణామలై జిల్లాలోని ఆరణి సమీపంలో ఉన్న సెవూరు గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సెవూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వీధిలో కుమార్ అనే వ్యాపారి పట్టుచీరల దుకాణం నడుపుతున్నారు. కొన్ని రోజుల క్రితం, తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్‌ ఉన్న ఓ లగ్జరీ కారులో నలుగురు మహిళలతో సహా ఆరుగురు వ్యక్తులు ఆయన దుకాణానికి వచ్చారు. 

ఖరీదైన చీరలను పరిశీలించిన వారు, కొన్ని తక్కువ ధరవి కొనుగోలు చేసి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత, షాపులో ఖరీదైన చీరలు కనిపించకపోవడంతో కుమార్ అనుమానంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కస్టమర్లలా వచ్చిన వారే చీరలను దొంగిలించినట్లు స్పష్టమైంది.

వెంటనే కుమార్ ఆరణి తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరీ ఘటనపై స్థానిక వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే, చోరీకి గురైన 32 పట్టుచీరలు ఓ కొరియర్ పార్శిల్‌లో కుమార్ చిరునామాకు వచ్చాయి. 

ఆశ్చర్యపోయిన ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు ఆ పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తూ, నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
Advertisement
Thieves
Tamil Nadu
Arani
Silk Saree Theft
Courier Return
Tiruvannamalai

More Telugu News