'మీరు చేసింది ప్రచారమే.. న్యాయం కాదు'.. జాన్వీ డీప్‌ఫేక్‌ వీడియోపై సెలబ్రెటీలకు ఆర్జీవీ చురకలు!

'మీరు చేసింది ప్రచారమే.. న్యాయం కాదు'.. జాన్వీ డీప్‌ఫేక్‌ వీడియోపై సెలబ్రెటీలకు ఆర్జీవీ చురకలు!

Ram Gopal Varma slams celebrities over Janhvi Kapoor deepfake video controversy
  • జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియోపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
  • సెలబ్రిటీల ట్వీట్లతోనే వీడియోకు భారీ ప్రచారం జరిగిందన్న వర్మ
  • నిందితుడిని పట్టుకోకుండా ప్రచారం చేయడంపై తీవ్ర విమర్శలు
  • బాధితురాలి పేరును బహిర్గతం చేయడం కూడా నేరమేనని స్పష్టీకరణ
  • దోషిని పట్టుకున్నాకే విషయం బయటపెట్టాల్సిందన్న ఆర్జీవీ
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. 'దేవర' సినిమాలోని 'చుట్టమల్లే' పాటకు సంబంధించి నటి జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియోపై ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదంపై స్పందించిన సినీ ప్రముఖులు, దానికి అనవసర ప్రచారం కల్పించారని వర్మ తీవ్రంగా విమర్శించారు.

ఈ అభ్యంతరకర వీడియోపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఆర్జీవీ తప్పుపట్టారు. వారి వరుస ట్వీట్ల వల్ల ఆ వీడియో గురించి తెలియని వారికి కూడా తెలిసిందని, ఫలితంగా కోట్లాది మంది దాని కోసం వెతికి చూసేలా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది బాధితురాలికి సహాయపడటం కాదని, మరింత నష్టం కలిగించడమేనని అన్నారు.

"నిజంగా చేయాల్సింది వేరు. సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో ఆ నీచమైన పని చేసిన వ్యక్తిని పట్టుకోవాలి. వాడిని పట్టుకున్న తర్వాత ఆ విషయాన్ని ప్రచారం చేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ అలా చేయకుండా, బాధితురాలి పేరును హైలైట్ చేస్తూ పోస్టులు పెట్టారు" అని వర్మ విమర్శించారు. 

బాధితురాలి గుర్తింపును ఇలా బహిరంగంగా ప్రచారం చేయడం కూడా చట్టపరంగా నేరమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద సెలబ్రిటీల స్పందన న్యాయం చేయడం కంటే, ఆ అభ్యంతరకర కంటెంట్‌కు ఉచిత ప్రచారం కల్పించినట్లుగా ఉందని ఆర్జీవీ తన వ్యాఖ్యల ద్వారా స్ప‌ష్టం చేశారు.
Advertisement
Ram Gopal Varma
Janhvi Kapoor
Deepfake Video
Devara Movie
Cyber Crime
Celebrity Controversy

More Telugu News