ఇళ్ల కొరత, అద్దెల భారం.. స్పెయిన్‌ను కుదిపేస్తున్న గృహ సంక్షోభం!

ఇళ్ల కొరత, అద్దెల భారం.. స్పెయిన్‌ను కుదిపేస్తున్న గృహ సంక్షోభం!

Spain housing crisis and rising rents spark massive protests
  • స్పెయిన్‌లో తీవ్రమైన గృహ సంక్షోభంపై భారీ నిరసనలు
  • రాజధాని మాడ్రిడ్‌తో పాటు 50 నగరాల్లో వేలాది మంది ఆందోళనలు
  • ప్రభుత్వం ప్రతిపాదించిన గృహ సంక్షోభ నివారణ చర్యలు విఫలం
  • అద్దెలు తగ్గించాలని, ఇళ్లు ఖాళీ చేయించకుండా రక్షణ కల్పించాలని డిమాండ్
  • దేశంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చనే ఊహాగానాలకు దారితీసిన పరిణామాలు
స్పెయిన్‌లో గృహ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇళ్ల కొరత, విపరీతంగా పెరిగిన అద్దెలు, బలవంతపు ఖాళీలపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. రాజధాని మాడ్రిడ్‌తో పాటు దేశంలోని 50 నగరాల్లో శనివారం పదివేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వం ప్రతిపాదించిన అత్యవసర గృహనిర్మాణ చర్యలను పార్లమెంట్ తిరస్కరించిన మరుసటి రోజే ఈ ఆందోళనలు జరగడం గమనార్హం.

మాడ్రిడ్‌లో జరిగిన ప్రదర్శనలో సుమారు 70,000 మంది పాల్గొన్నారని అధికారులు అంచనా వేయగా, ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అద్దెలు తగ్గించాలని, ఇళ్లు ఖాళీ చేయించకుండా బలమైన చట్టపరమైన రక్షణ కల్పించాలని, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లు నివాస గృహాలను కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కొందరు దేశవ్యాప్త సమ్మెకు కూడా పిలుపునిచ్చారు.

గత నెలలో జరిగిన ఒక సంఘటన ఈ ఆందోళనలకు మరింత ఆజ్యం పోసింది. దశాబ్దాలుగా ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 87 ఏళ్ల మారికార్మెన్ అబాస్కల్‌ను ఇంటి నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. ఆ భవనాన్ని కొనుగోలు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అద్దెను భారీగా పెంచడంతో ఆమె చెల్లించలేకపోయారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచింది.

ప్రస్తుతం స్పెయిన్‌లో దాదాపు 7 లక్షల ఇళ్ల కొరత ఉన్నట్లు అంచనా. 2025లో సగటున అద్దెలు 8.5% పెరగ్గా, మాడ్రిడ్, బార్సిలోనా వంటి నగరాల్లో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంది. దీంతోపాటు ఇళ్ల ధరలు కూడా ఆకాశాన్నంటాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని పెడ్రో సాంచెజ్ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం రెండు కీలక డిక్రీలను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బలహీన వర్గాల వారిని 2030 వరకు ఇళ్ల నుంచి ఖాళీ చేయించకుండా నిలిపివేయడం, కొన్ని అద్దె ఒప్పందాలను పొడిగించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. 

అయితే, ప్రతిపక్షాలైన పాపులర్ పార్టీ, వోక్స్, జంట్స్ పార్టీలు వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదనలు వీగిపోయాయి. ఈ రాజకీయ పరిణామాలతో స్పెయిన్‌లో ముందస్తు ఎన్నికలు రావొచ్చనే ఊహాగానాలు బలపడ్డాయి.
Advertisement
Spain
Spain housing crisis
Madrid housing protests
Spain rent increase
Pedro Sanchez housing policy
Spain property market news

More Telugu News