సుప్రీం తీర్పు తర్వాతే మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ
Advertisement

సుప్రీం తీర్పు తర్వాతే మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ

Minister Narayana says AP municipal elections after Supreme Court verdict
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం
  • బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నారాయణ
  • గత ప్రభుత్వం వల్లే అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని విమర్శ
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించారు. అమరావతిలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే 123 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి నారాయణ వివరించారు. ఇందుకోసం సుమారు రూ.2,000 కోట్లు కేటాయించామని, ఇందులో ఒక్క రాజమండ్రి అభివృద్ధి పనులకే రూ.1,000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాలుగా ఉన్నప్పటికీ, పుష్కరాల నిర్వహణకు నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.5,350 కోట్ల నిధులు వినియోగించుకోకపోవడంతో నిలిచిపోయిన ప్రాజెక్టులను కేంద్రం సహకారంతో పునరుద్ధరిస్తామని తెలిపారు.

అమరావతి అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచంలోని ఐదు ఉత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. గత ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 2028 చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2027లో 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో రోడ్లు, ఘాట్లు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతుల పనులను వివిధ శాఖలు సమన్వయంతో చేపడుతున్నాయి.
Advertisement
Minister Narayana
AP Municipal Elections
BC Reservations Andhra Pradesh
Godavari Pushkaralu 2027
Amaravati Capital Development
Supreme Court AP Elections Case

More Telugu News