పాక్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఆసియా క్రీడల్లో స్వర్ణం నిలబెట్టుకున్న భారత్
Advertisement

పాక్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఆసియా క్రీడల్లో స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

India Cricket Team beats Pakistan to retain Asian Games cricket gold medal
  • పాక్‌పై 19 పరుగులతో భారత్‌ ఘన విజయం
  • ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత్
  • 20 బంతుల్లోనే అభిషేక్‌ శర్మ అర్ధశతకం
  • 21 బంతుల్లో హాఫ్‌ సెంచరీ బాదిన తిలక్‌ వర్మ
  • 96 పరుగులతో అజేయంగా నిలిచిన హసన్‌ నవాజ్‌
ఆసియా క్రీడల క్రికెట్‌లో భారత జట్టు మరోసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో అభిషేక్‌ శర్మ (61), తిలక్‌ వర్మ (51 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్‌ 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాక్‌ 192 పరుగులకే పరిమితమైంది. హసన్‌ నవాజ్‌ (96 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేసినా.. పాక్‌ను గెలిపించలేకపోయాడు.

అభిషేక్‌ మెరుపులు.. తిలక్‌ దూకుడు
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు అభిషేక్‌ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. పాక్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. దీంతో పాక్‌పై టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో 2025లో దుబాయ్‌లో 24 బంతుల్లో సాధించిన తన రికార్డునే అధిగమించాడు. అభిషేక్‌ 28 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.

ఆ తర్వాత తిలక్‌ వర్మ తనదైన శైలిలో చెలరేగాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. శివమ్‌ దూబేతో కలిసి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. దీంతో భారత్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

హసన్‌ పోరాటం వృథా
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు హసన్‌ నవాజ్‌ అండగా నిలిచాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 51 బంతుల్లోనే 96 పరుగులతో అజేయంగా నిలిచాడు. సైమ్‌ అయూబ్‌ (29) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. భారత స్పిన్నర్లు వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీసి పాక్‌ పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశారు. చివర్లో శివమ్‌ దూబే కూడా రెండు వికెట్లు పడగొట్టడంతో పాక్‌ 20 ఓవర్లలో లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో భారత్‌ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. 

ఆసియా క్రీడల క్రికెట్లో మహిళల స్వర్ణం కూడా భారత్ ఖాతాలో చేరడం తెలిసిందే. ఇప్పుడు పురుషుల టీమ్ కూడా ఫైనల్లో గెలవడంతో క్రికెట్లో భారత్ గోల్డెన్ డబుల్ సాధించినట్టయింది.
Advertisement
India Cricket Team
Abhishek Sharma
Tilak Varma
Asian Games Gold Medal
India vs Pakistan Final
Cricket Asian Games

More Telugu News