ఫేస్‌బుక్‌ ఆలోచన మన భారతీయుడిదే.. జుకర్‌బర్గ్‌పై కోర్టుకెక్కి రూ.వందల కోట్లు పొందిన యువకుడు!
Advertisement

ఫేస్‌బుక్‌ ఆలోచన మన భారతీయుడిదే.. జుకర్‌బర్గ్‌పై కోర్టుకెక్కి రూ.వందల కోట్లు పొందిన యువకుడు!

Divya Narendra Facebook idea belongs to an Indian who sued Mark Zuckerberg and won crores
  • ఫేస్‌బుక్‌ ఆలోచన వెనుక దివ్య నరేంద్ర కృషి
  • 2002లో ‘హార్వర్డ్‌ కనెక్షన్‌’ ప్రాజెక్టు ప్రారంభం
  • వింక్లెవాస్‌ సోదరులతో కలిసి దివ్య ప్రణాళిక
  • 2003లో ప్రాజెక్టులోకి వచ్చిన మార్క్‌ జుకర్‌బర్గ్‌
  • వింక్లెవాస్‌, దివ్యకు తెలియకుండా 2004లో ఫేస్‌బుక్‌ ప్రారంభంచిన జుకర్‌బర్గ్‌
ఫేస్‌బుక్‌ సృష్టికర్తగా మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కానీ ఈ సోషల్‌ మీడియా వేదిక ఆలోచన వెనుక ఓ భారతీయ మూలాలున్న యువకుడి కృషి కూడా ఉంది. అతడే దివ్య నరేంద్ర. ఫేస్‌బుక్‌ ఆవిర్భావానికి ముందు అతడు ప్రారంభించిన ప్రాజెక్టు.. చివరకు జుకర్‌బర్గ్‌తో న్యాయపోరాటానికి దారితీసింది.

హార్వర్డ్‌లో మొదలైన ఆలోచన
అమెరికాలో స్థిరపడిన భారతీయ వైద్య దంపతుల కుమారుడైన దివ్య నరేంద్ర.. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లోనే ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. 2002 డిసెంబరులో విద్యార్థులంతా ఆన్‌లైన్‌లో ఒకరితో ఒకరు అనుసంధానం అయ్యేలా ఓ సోషల్‌ నెట్‌వర్క్‌ను రూపొందించాలని భావించాడు. ఇందుకోసం హార్వర్డ్‌ విద్యార్థులైన కామెరాన్‌, టైలర్‌ వింక్లెవాస్‌ సోదరులతో కలిసి పనిచేశాడు. ఈ ప్రాజెక్టుకు తొలుత ‘హార్వర్డ్‌ కనెక్షన్‌’ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ‘కనెక్ట్‌యూ’గా మార్చారు. మొదట హార్వర్డ్‌లో ప్రారంభించి, క్రమంగా ఇతర విశ్వవిద్యాలయాలకూ విస్తరించాలన్నది వారి లక్ష్యం.

ప్రాజెక్టులోకి జుకర్‌బర్గ్‌..
వెబ్‌సైట్‌ అభివృద్ధి బాధ్యతలను తొలుత సంజయ్‌ మావింకుర్వేకు అప్పగించారు. ఆయన గూగుల్‌లో ఉద్యోగం రావడంతో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత విక్టర్‌ గావో కొంత కోడింగ్‌ చేసినప్పటికీ, పనులు పూర్తికాలేదు. దీంతో 2003 నవంబరులో మార్క్‌ జుకర్‌బర్గ్‌ను సంప్రదించారు. అప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ, డేటాబేస్‌, వెబ్‌పేజీలు, కోడింగ్‌ వంటి కీలక పనులు కొంతవరకు పూర్తయ్యాయి. ప్రాజెక్టు వివరాలు, కోడ్‌ను కూడా జుకర్‌బర్గ్‌తో పంచుకున్నారు. అయితే కొంతకాలానికే ఆయన సమావేశాలను వాయిదా వేస్తూ, సందేశాలకు స్పందించడం తగ్గించారని దివ్య, వింక్లెవాస్‌ సోదరులు ఆరోపించారు.

ఫేస్‌బుక్‌ ఆవిర్భావం.. వివాదం
2004 జనవరి 11న జుకర్‌బర్గ్‌ ‘ది ఫేస్‌బుక్‌’ డొమైన్‌ను నమోదు చేశారు. అదే ఏడాది ఫిబ్రవరి 4న హార్వర్డ్‌లో ఫేస్‌బుక్‌ను ప్రారంభించారు. రెండు రోజుల తర్వాత కొత్త సోషల్‌ నెట్‌వర్క్‌ గురించి విద్యార్థుల చర్చలతో ఈ విషయం దివ్య నరేంద్ర దృష్టికి వచ్చింది. తమ ఆలోచనను జుకర్‌బర్గ్‌ ఉపయోగించుకున్నారని దివ్య, వింక్లెవాస్‌ సోదరులు ఆరోపించారు. తొలుత హార్వర్డ్‌ యాజమాన్యాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. అయితే తమ కోడ్‌ను ఫేస్‌బుక్‌లో ఉపయోగించలేదని జుకర్‌బర్గ్‌ వాదించారు.

రూ.300 కోట్లతో రాజీ
ఏళ్ల తరబడి సాగిన ఈ న్యాయపోరాటం చివరకు కోర్టు బయట ఒప్పందంతో ముగిసింది. ఈ సెటిల్‌మెంట్‌ విలువ 6.5 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.300 కోట్లకు పైగా అప్పటి మారకపు విలువ ప్రకారం) వెల్లడైంది. ఇందులో దివ్యకు కొంతమేర ఫేస్‌బుక్‌ షేర్లు కూడా లభించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన న్యాయ, వ్యాపార విద్యపై దృష్టి సారించారు. పెట్టుబడుల రంగానికి సంబంధించిన సోషల్‌ నెట్‌వర్క్‌ ‘సమ్‌జీరో’ను సహవ్యవస్థాపకుడిగా ప్రారంభించారు. ఫేస్‌బుక్‌ ఆవిర్భావ కథ ఆధారంగా 2010లో వచ్చిన ‘ది సోషల్‌ నెట్‌వర్క్‌’ సినిమాలోనూ దివ్య పాత్రకు చోటు దక్కింది. ఆ పాత్రను నటుడు మ్యాక్స్‌ మింగెల్లా పోషించారు.
Advertisement
Divya Narendra
Mark Zuckerberg
Facebook lawsuit settlement
ConnectU co-founder
HarvardConnection
SumZero founder

More Telugu News