2 నిమిషాల్లో 17 వేల అడుగుల పతనం.. హైజాక్‌ కలకలంతో రంగంలోకి యుద్ధ విమానాలు!
Advertisement

2 నిమిషాల్లో 17 వేల అడుగుల పతనం.. హైజాక్‌ కలకలంతో రంగంలోకి యుద్ధ విమానాలు!

FlyDubai flight drops 17000 feet in 2 minutes fighter jets scrambled after hijack alert
  • ఫ్లై దుబాయ్‌ విమానంలో అత్యవసర పరిస్థితి
  • విమానం నుంచి హైజాక్‌ సంకేతాలతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌
  • గగనతలంలోకి యుద్ధ విమానాలను పంపిన ఇజ్రాయెల్‌
  • పైలట్ల మధ్య ఘర్షణే కారణమని ప్రాథమిక కథనాలు
  • సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండైన విమానం
దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం ఒక్కసారిగా 17,400 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగడం, హైజాక్‌ హెచ్చరికతో కూడిన అత్యవసర సంకేతాలు పంపడంతో తీవ్ర కలకలం రేగింది. అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ వైమానిక దళం యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. చివరకు ఆ విమానం సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా దిగింది. విమానంలోని ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన ఘర్షణే ఈ ఘటనకు కారణమని ప్రాథమిక కథనాలు వెల్లడించాయి.

2 నిమిషాల్లో భారీగా కిందకు..
దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టెల్‌ అవీవ్‌ సమీపంలోని బెన్‌ గురియన్‌ విమానాశ్రయానికి ఫ్లై దుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానం బయలుదేరింది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 రకానికి చెందిన ఈ విమానంలో సుమారు 180 మంది ఇజ్రాయెల్‌ ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమానం 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. కేవలం రెండు నిమిషాల్లోనే 16,600 అడుగుల స్థాయికి పడిపోయింది. దీంతో విమానంలో ఏదో తీవ్ర సమస్య తలెత్తినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

హైజాక్‌ సంకేతంతో కలకలం
విమానం తొలుత సాధారణ అత్యవసర పరిస్థితిని సూచించే 7700 సంకేతాన్ని పంపింది. ఆ తర్వాత 7500 కోడ్‌కు మారడంతో హైజాక్‌ జరిగి ఉండొచ్చన్న ఆందోళన నెలకొంది. ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి. అయితే హైజాక్‌ యత్నం జరగలేదని ఇజ్రాయెల్‌ మీడియా తర్వాత వెల్లడించింది.

పైలట్ల మధ్య ఘర్షణ?
విమానంలోని ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది భౌతిక ఘర్షణకు దారితీసినట్లు భద్రతా వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు తెలిపాయి. ఓ పైలట్‌పై కత్తితో దాడి జరిగినట్లు ప్రయాణికులు వెల్లడించినట్లు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌’ పేర్కొంది. కొందరు ప్రయాణికులు సిబ్బందికి సహకరించి దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఘర్షణకు అసలు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదు.

ప్రయాణికులను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఈ ఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రయాణికులను సురక్షితంగా ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
Advertisement
FlyDubai
Israel fighter jets
Boeing 737 MAX 8
Pilot fight
Saudi Arabia Tabuk
Hijack alert

More Telugu News