టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా?
Advertisement

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా?

Pragyan Ojha likely to become Team India Chief Selector
  • ప్రస్తుతం సెలెక్షన్ కమిటీకి తాత్కాలిక హెడ్‌గా ఉన్న ఓజా
  • కోచ్ గంభీర్‌తో గువాహటిలో సమావేశమైన సెలెక్టర్లు
  • న్యూజిలాండ్ పర్యటనకు జట్ల ఎంపికపై సుదీర్ఘ చర్చ  
టీమిండియా మాజీ స్పిన్నర్  ప్రజ్ఞాన్ ఓజా భారత క్రికెట్ జట్టు తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అజిత్ అగార్కర్ ఈ పదవి నుంచి వైదొలగడంతో, ప్రస్తుతం సెలెక్షన్ కమిటీకి తాత్కాలిక హెడ్‌గా ఉన్న 39 ఏళ్ల ఓజానే పూర్తిస్థాయి చీఫ్ సెలెక్టర్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం గువాహటిలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో నలుగురు సెలెక్టర్ల కమిటీ సుదీర్ఘంగా సమావేశమైంది. వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ఒకరోజు ముందు బర్సపరా స్టేడియంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రజ్ఞాన్ ఓజాతో పాటు శివ సుందర్ దాస్, అజయ్ రాత్రా, ఆర్‌పీ సింగ్ పాల్గొన్నారు. అయితే, మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇందులో పాలుపంచుకోలేదు. సాధారణంగా ఒక ద్వైపాక్షిక సిరీస్ సమయంలో సెలెక్షన్ కమిటీ మొత్తం ఇలా సమావేశం కావడం అరుదు కావడంతో, ఓజా నియామకం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.

త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ఎంపిక చేసే విషయంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 27 వరకు జరగనున్న ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. దీంతో పాటు, అక్టోబర్ 24 నుంచి న్యూజిలాండ్‌లో మూడు టెస్టులు ఆడనున్న భారత్ 'ఎ' జట్టును కూడా ఎంపిక చేయాల్సి ఉంది.

భారత జట్టు వరుస సిరీస్‌లతో తీరిక లేకుండా ఉండటంతో ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కొత్త సెలెక్షన్ కమిటీకి పెద్ద సవాలుగా మారనుంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పును సిద్ధం చేసేందుకు కూడా ఈ పర్యటన కీలకం కానుంది. సీనియర్ జట్టు అవసరాలతో పాటు, భారత్ 'ఎ' కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఓజా నేతృత్వంలోని కమిటీ ముందున్న ప్రధాన కర్తవ్యం.
Advertisement
Pragyan Ojha
Team India Chief Selector
BCCI Selection Committee
Gautam Gambhir
India vs New Zealand series
Indian Cricket Team

More Telugu News