2028 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా కుప్పం: సీఎం చంద్రబాబు

2028 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా కుప్పం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu aims to make Kuppam carbon neutral by 2028
  • కుప్పంలో వివిధ పథకాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
  • సూపర్ సిక్స్, సంజీవని పథకాల అమలు తీరుపై ఆరా
  • త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సంజీవని కార్యక్రమం విస్తరణకు ప్రణాళిక
  • వ్యవసాయం, పర్యాటకం, మౌలిక వసతులపై అధికారులకు కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా సూపర్‌ సిక్స్‌ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్‌ భరోసా వంటి పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు, వాటితో కుటుంబంలో వచ్చిన ఆర్థిక మార్పుల గురించి లబ్ధిదారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, కుప్పంలోని యువ పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారికి ప్రభుత్వ ప్రోత్సాహంపై భరోసా ఇచ్చారు. పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న సంజీవని సేవల లబ్ధిదారులతో మాట్లాడి, పథకం పనితీరుపై ఆరా తీశారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవాలనే లక్ష్యంతో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే మా ప్రభుత్వ ధ్యేయం" అని స్పష్టం చేశారు.

అభివృద్ధి పనులపై సమీక్ష, అధికారులకు ఆదేశాలు 
కుప్పంలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పనపై స్థానికులతో సీఎం చర్చించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పనుల కోసం కొత్త రోడ్లు వేయడానికి ముందే పైప్‌లైన్లు వేయాలని, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి స్ట్రీట్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కుప్పం దేశానికే ఆదర్శం 
"2028 నాటికి కుప్పం నియోజకవర్గాన్ని కార్బన్‌ న్యూట్రల్‌గా మార్చడమే లక్ష్యం. ఈ ఏడాది డిసెంబరు నాటికి ప్రతి ఇంటిపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలి. వ్యర్థాలను సంపదగా మార్చి, పచ్చదనాన్ని 80 శాతానికి పెంచి కుప్పాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. వ్యవసాయ వ్యయం తగ్గించి, రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రచిస్తామని, పర్యాటకంగాను కుప్పాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. జీరో పావర్టీ కార్యక్రమంలో భాగంగా 2026 డిసెంబరు నాటికి నియోజకవర్గంలోని 8,904 'బంగారు కుటుంబాలను' ఆర్థికంగా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
Advertisement
Chandrababu Naidu
Kuppam constituency
Carbon neutral Kuppam
Andhra Pradesh welfare schemes
Solar power project
Zero poverty program

More Telugu News