వైసీపీ ఆందోళన నిరసన కాదు.. అరాచకం: బుద్ధా వెంకన్న
- వైసీపీ నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్యబద్ధం కాదన్న బుద్దా వెంకన్న
- డీఎస్సీ ప్రక్రియపై జగన్ విషప్రచారం చేస్తున్నారని మండిపాటు
- డీఎస్సీ ఉద్యోగాలు దక్కడంతో నిరుద్యోగ యువత ఆనందంతో ఉందని వ్యాఖ్య
విజయవాడలో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళన ఎంతమాత్రం కాదని, అది నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అరాచక చర్య మాత్రమేనని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ అధినేత జగన్ ప్రజల్లో కావాలని విషప్రచారం చేస్తున్నారని, అయితే ఆయన అబద్ధాలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని స్పష్టం చేశారు. ఎటువంటి పక్షపాతానికి తావులేకుండా అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని తేల్చిచెప్పారు.
ప్రత్యేకించి స్పోర్ట్స్ కోటా కింద అర్హత సాధించిన క్రీడాకారులకు పారదర్శకంగా డీఎస్సీ ఉద్యోగాలు దక్కడంతో నిరుద్యోగ యువత ఎంతో ఆనందంతో ఉందని బుద్ధా వెంకన్న తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువత భద్రతకు, ఉపాధి కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంటే, అర్హులైన క్రీడాకారులకు న్యాయం జరగడాన్ని కూడా వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో సంచలనాత్మక మార్పులు తీసుకొస్తూ యువతకు మెరుగైన భవిష్యత్తును అందిస్తున్న మంత్రి నారా లోకేశ్ పై ఉన్న రాజకీయ అసూయతోనే వైసీపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు ఒడిగడుతోందని, ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలను ప్రజలే స్వయంగా తిప్పికొడతారని హెచ్చరించారు.