రూ.40 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా చేశారంటూ రిజిస్ట్రేషన్ డీజీ ఆఫీస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన
- తాడిపత్రిలో వైసీపీ నేతలు భూ కబ్జా చేశారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
- ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో అధికారులు విఫలమయ్యారని మండిపాటు
- పెద్దారెడ్డి కూడా 2 సెంట్ల భూమి కబ్జా చేశారని ఆరోపణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సుమారు రూ. 40 కోట్ల విలువైన విలువైన ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలు అక్రమంగా కాజేశారని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ డీజీ కార్యాలయం ఎదుట ఆయన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ బసవరాజు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని, ఆయనతో పాటు దీనికి సహకరించిన బాధ్యులైన అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా 2 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని, ఆధారాలున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఈ భూ వివాదం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపి డిప్యూటీ తహసీల్దార్ సోమశేఖర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, వీఆర్ఓ వెంకటస్వామితో పాటు జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ షఫీలను సస్పెండ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.