మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన పవన్ కల్యాణ్

మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan offers silk clothes to Maisamma Goddess
  • పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటన 
  • ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన చెరువు ప్రారంభం
  • పిఠాపురంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల ఆధునీకరణ
  • గ్రామాల్లో చెరువులను ఆహ్లాద, ఆరోగ్య కేంద్రాలుగా మార్చే ప్రణాళిక
  • రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్లతో 105 చెరువుల అభివృద్ధి
ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఫకృద్ధీన్ పాలెం గ్రామంలోని మైసమ్మ చెరువు గట్టుపై వెలసిన మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, గ్రామీణ చెరువులకు సరికొత్త రూపునిచ్చే బృహత్తర కార్యక్రమంలో భాగంగా రూ. 73 లక్షల వ్యయంతో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రజలకు అంకితం చేశారు.

గ్రామాల్లోని చెరువులను కేవలం నీటి వనరులుగా కాకుండా, ప్రజలందరికీ ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచే సామాజిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తెలిపారు. ఫకృద్ధీన్ పాలెంలోని మైసమ్మ చెరువును రాష్ట్రానికే ఒక మోడల్‌గా అభివృద్ధి చేసినట్లు వివరించారు. చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, పిల్లల పార్కును ఆయన ప్రారంభించారు. చెరువు గట్టుపై కలియదిరుగుతూ, అక్కడి వృక్షాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు మధ్యలో నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వరుడి సహిత శివుని విగ్రహాన్ని పరిశీలించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా చెరువు గట్టును బలోపేతం చేసి, పచ్చదనంతో నింపారు. ప్రజలు వ్యాయామం చేసుకునేలా ఓపెన్ జిమ్‌తో పాటు, జాతీయ భావాన్ని పెంపొందించేలా జెండా స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. చెరువు పక్కనే చిన్నారుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పార్కును పిల్లలతో కలిసి ప్రారంభించిన పవన్ కల్యాణ్, వారితో సరదాగా గడిపి చాక్లెట్లు పంచారు.

రాష్ట్రవ్యాప్తంగా చెరువుల ఆధునికీకరణ
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) నిధులతో రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్లతో 105 చెరువుల సుందరీకరణ పనులు చేపట్టినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే రూ. 6 కోట్లతో 11 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, వీటికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పరిధిలో అభివృద్ధి చేసిన 14 చెరువుల ఫొటో గ్యాలరీని తిలకించారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని చెరువుల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

పర్యటనలో భాగంగా ఆయన గ్రామ సచివాలయాన్ని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Pawan Kalyan
Pithapuram
Maisamma Temple
Tank Modernization
Andhra Pradesh Deputy CM
PMKSY Scheme

More Telugu News