వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో బదులిచ్చారు. వైసీపీ '2.0' అంటూ బెదిరింపులకు దిగితే, ఎన్డీఏ కూటమి '10X' అంటే ఏంటో చూపిస్తుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఎన్డీఏ మీడియా సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని పవన్ స్పష్టం చేశారు. బలహీనులు మాత్రమే బెదిరింపుల భాష మాట్లాడతారని, బలవంతులు ఎప్పుడూ అలా చేయరని అన్నారు. ఇలాంటి మాటల వల్లే గత ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన విషయాన్ని మరువరాదని అన్నారు. వైసీపీ 1.0 పాలనలో జరిగిన హింసను తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని, ప్రజలకు అండగా ఎలా నిలవాలో తమకు బాగా తెలుసని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లుగా, జగన్ ప్రజల్లోకి వస్తే వారి కష్టాలు, మనోభావాలు అర్థమవుతాయని పవన్ హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ఐక్యంగానే ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వంటి సంక్లిష్టతలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రగతి కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతామని తెలిపారు. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి తప్ప హెచ్చరికలు జారీ చేయకూడదని సూచించారు. ఇదే సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీ నేతల ప్రవర్తన వల్ల సమాజం నష్టపోతోందని విమర్శించారు.