దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్‌.. ఎమ్మెల్యేగా అనర్హత వేటు!

దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్‌.. ఎమ్మెల్యేగా అనర్హత వేటు!

Danam Nagender disqualified as MLA by Telangana High Court
  • 2024 ఏప్రిల్‌ 23 నుంచే అనర్హత వర్తింపు
  • స్పీకర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం
  • బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం
  • కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ
  • ఏలేటి, కౌశిక్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు
  • ఖైరతాబాద్‌ స్థానం ఖాళీగా అయినట్లు స్పష్టీకరణ
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పార్టీ మార్పు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయనపై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దానం నాగేందర్‌ 2024 ఏప్రిల్‌ 23 నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడిగా పరిగణించాలని స్పష్టం చేసింది. 

దానం నాగేందర్‌ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖైరతాబాద్‌ నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ నిబంధనలను ఆయన ఉల్లంఘించారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు సమర్పించినప్పటికీ.. సరైన ఆధారాలు లేవంటూ స్పీకర్‌ ట్రైబ్యునల్‌ 2026 మార్చి 11న పిటిషన్లను తిరస్కరించిందని పేర్కొన్నారు.

స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం స్పీకర్‌ నిర్ణయంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తాజా తీర్పుతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయాన్ని స్పీకర్‌, ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది.

దానం నాగేందర్‌ అనర్హతపై హైకోర్టు తీర్పును తొలుత సెప్టెంబర్‌ 16న వెలువరించాల్సి ఉండగా.. శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Advertisement
Danam Nagender
Telangana High Court
MLA Disqualification
Khairatabad MLA
Anti Defection Law
Telangana Politics

More Telugu News