మోహన్ లాల్ కూతురు 'విస్మయ' ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'తుడక్కమ్'. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ డ్రామా ఇది. జుడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నిర్మాత ఆంటోని పెరంబవూర్ తనయుడు 'ఆశిష్ జో ఆంటోని' ఒక కీలకమైన పాత్రను పోషించాడు. గెస్టు రోల్ లో మోహన్ లాల్ మెరిసిన ఈ సినిమా, ఆగస్టు 7వ తేదీన విడుదలై 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఈ రోజు ( సెప్టెంబర్ 18) నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోలోను అందుబాటులో ఉంది.
'రవి బాలచంద్రన్' ( మలయాళ సాయికుమార్) విలేజ్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. రెండు కాళ్లూ చచ్చుబడి పోవడం వలన, వీల్ ఛైర్ లో కూర్చునే తన కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. ఆయనకి పెళ్లీడు కొచ్చిన ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి పేరే 'మీను' ( విస్మయ మోహన్ లాల్). తల్లిలేని పిల్ల కావడంతో ఆయన చాలా గారాబంగా పెంచుతాడు. ఊరికి దూరంగా ఉన్న ఇల్లు కావడం వలన, 'మెస్సి' అనే ఒక కుక్కను పెంచుతూ ఉంటారు. అక్కడికి దగ్గరలో జోసెఫ్ మాస్టర్ ఇల్లు తప్ప, మరెవరూ కనిపించరు. ఆయనే రవి ఫ్యామిలీకి అండ అని చెప్పుకోవాలి.
జోసెఫ్ మాస్టర్ కి ఒక తమ్ముడు ఉంటాడు. ఆస్తి విషయంలో అతను తరచూ అన్నతో గొడవపడుతూ ఉంటాడు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న అతని కారణంగా తమకి ప్రమాదం ఉందని జోసెఫ్ భార్యకి ఒక అనుమానమైతే ఉంటుంది. ఆమె ఊహించినట్టుగానే ఆ ఫ్యామిలీని లేపేయాలని అతను నిర్ణయించుకుంటాడు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటాడు.
'మీను'కి ధైర్య సాహసాలు ఎక్కువే. ఎదుటివారికి సాయం చేయడంలో ఆమె ఎంతమాత్రం వెనుకాడదు. అలాంటి ఆమె బ్యాంకు టెస్ట్ రాయడానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి కంగారుపడుతూ ఉంటాడు. ఆమె ఫోన్ కి కాల్ కూడా కనెక్ట్ కాకపోవడంతో అతను తీవ్రమైన ఆందోళనకి లోనవుతాడు. ఆమెతో పాటు వెళ్లిన స్నేహతురాలు 'ప్రియ' కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అతణ్ణి మరింత టెన్షన్ పెడుతూ ఉంటుంది.
ఆ చీకట్లో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్టేషన్ కి వెళ్లిన రవిని, అక్కడి పోలీసులు పెద్దగా పట్టించుకోరు. ప్రియతో కాకుండా బస్సులో ఒంటరిగా వస్తున్న 'మీను', క్రిమినల్ తో గొడవపడుతుంది. చాలా తేలికగా హత్యలు చేసే అతను, తన వలలో పడవలసిన అమ్మాయిలను మీను తప్పించిందనే కోపంతో ఉంటాడు. కరడుగట్టిన ఆ నేరస్థుడి బారి నుంచి 'మీను' బయట పడుతుందా? ప్రియ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి కారణం ఏమిటి? అనేది మిగతా కథ.
పొద్దుపోయినా కూతురు ఇంటికి తిరిగి రాకపోతే ఏ తండ్రికైనా చాలా టెన్షన్ గా ఉంటుంది. ఇక ఆ తండ్రి నిస్సహాయుడైతే, ఆందోళన మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ కూతురు ఒక భయంకరమైన కిరాతకుడి కంట్లో పడితే .. అతనితో ఆమె గొడవపడితే ఏం జరుగుతుంది? ఒక ఆడపిల్లకి .. ఒక హంతకుడికి మధ్య జరిగే పోరాటం చుట్టూ నడిచే కథను దర్శకుడు చాలా పట్టుగా రాసుకున్నాడు.
నిస్సహాయుడైన ఒక తండ్రి .. అతను ప్రాణంగా చూసుకునే ఒక కూతురు, ఆస్తి తాలూకు గొడవలతో ఇద్దరు అన్నదమ్ములు ..ఆ మధ్య ఒక నరహంతకుడు. ఈ ఐదు పాత్రలతో దర్శకుడు ఈ కథను నడిపించుకుంటూ వెళ్లాడు. తండ్రీ కూతుళ్లు .. హంతకుడు .. ఈ మూడు పాత్రలు మరింత ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. ఈ సినిమా ఫస్టాఫ్ .. సెకండాఫ్ అన్నట్టుగా మనకి గుర్తుండదు. మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యేవరకూ దృష్టిని మరో వైపు వెళ్లనీయదు.
'మీను' పాత్రకి కిల్లర్ తారసపడటం .. ఇద్దరి మధ్య గొడవ .. ఆమెను అతను ఫాలో కావడం .. వంటి సన్నివేశాలు సహజత్వానికి చాలా దగ్గరగా వెళుతూ ఉత్కంఠను రేకెత్తిస్తాయి. కిల్లర్ ఎప్పటికప్పుడు 'మీను'కి చాలా దగ్గరగా వస్తుంటాడు. ఆ సమయంలో ఆడియన్స్ గుండెదడ పెరగడం ఖాయమని చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి, ఏం జరుగుతుందో ఏమిటో అనే ఒక టెన్షన్ ఆడియన్స్ లో మొదలవుతుంది.
ఇటు మీను పాత్ర .. అటు కిల్లర్ పాత్ర ఈ రెండు కూడా ఈ కంటెంట్ కి రెండు కళ్ల మాదిరిగా కనిపిస్తాయి. అయితే కిల్లర్ పాత్రను డిజైన్ చేసిన తీరు ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. మొదటి నుంచి చివరి వరకూ కిల్లర్ పాత్రకి ఎక్కడా డైలాగ్స్ ఉండవు. సినిమా ఇంకో 10 నిమిషాల్లో పూర్తవుతుందనగా, ఓ రెండు మాటలు ఉంటాయంతే. అప్పటివరకూ ఆ పాత్ర చూపులతో .. బాడీ లాంగ్వేజ్ తోనే భయపెడుతుంది.
జోమన్ జాన్ ఫొటోగ్రఫీ .. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం .. చమన్ చాకో ఎడిటింగ్ ఈ కథకు అదనపు బలాన్ని అందించాయని చెప్పచ్చు. ఆసక్తికరమైన సన్నివేశాలే తప్ప, అనవసరమైన సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. విస్మయ మోహన్ లాల్ కి ఇది ఫస్టు మూవీ అయినప్పటికీ గొప్పగా చేసింది. ఆశిష్ కూడా తన పాత్రలో మెప్పించాడు. మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఈ రోజులలో ఆడపిల్లలను బయటికి పంపించడమంటే, ప్రమాదంలోకి పంపించడం వంటిదేనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అలాగని వాళ్లను ఇంటికి పరిమితం చేయలేరు .. ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా రానూ లేరు. అందుకే ఆత్మరక్షణ కోసం వాళ్లకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించవలసిన అవసరం ఉందనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కంటెంట్ గా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు.
'తుడక్కమ్' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
Thudakkam Review
Movie Details
Movie Name: Thudakkam
Genre: Action, Drama
Release Date: 2026-09-18
Cast: Vismaya Mohanlal,Ashish Joe Antony ,Sai Kumar ,Mohanlal,Manoj K Jayan
Director: Jude Anthany Joseph
PRO: -
Music: Jakes Bejoy
Banner: Aashirvad Cinemas
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer