కేసీఆర్, కుటుంబ ఆస్తులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్

కేసీఆర్, కుటుంబ ఆస్తులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్

KTR reacts strongly to Revanth Reddy comments on KCR family assets
  • కేసీఆర్‌కు 1,000 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందనడంపై కేటీఆర్ ఆగ్రహం
  • మాజీ సీఎంకు ఉన్నది 67 ఎకరాలేనని స్పష్టం
  • పుట్టుక నుంచి తమ ఆస్తులపై విచారణకు సిద్ధమని ప్రకటన
  • మీ ఆస్తులపైనా విచారణకు సిద్ధమా అంటూ రేవంత్‌కు సవాల్
  • సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌కు 1,000 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటూ ముఖ్యమంత్రి విషప్రచారం చేస్తున్నారని, ఇందుకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

కేసీఆర్‌కు ఉన్నది 1,000 ఎకరాలు కాదని, కేవలం 67 ఎకరాలు మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీ వేదికగా అంగీకరించారని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ముఖ్యమంత్రికి ఓ సవాల్ విసిరారు. "కేసీఆర్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మా కుటుంబం ఆస్తులపై పూర్తిస్థాయి విచారణకు మేము సిద్ధం. మరి పుట్టినప్పటి నుంచి మీ ఆస్తులపై విచారణకు మీరు సిద్ధమా?" అని రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు.

కేసీఆర్ వ్యవసాయాన్ని ప్రేమించే నిజమైన రైతు అని, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన సాగు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. కొందరు భూమిని ఒక వ్యాపార వస్తువుగా చూస్తే, కేసీఆర్ మాత్రం దానిని ఎంతో పవిత్రంగా భావిస్తారని పేర్కొన్నారు. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములపై అనవసర రాద్ధాంతం చేస్తూ రేవంత్ రెడ్డి 'సెల్ఫ్ గోల్' చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

కేసీఆర్ తండ్రికి వందల ఎకరాల ఆస్తి ఉండేదని, చింతమడకలోని తమ పాత ఇంటిని ప్రభుత్వ పాఠశాల కోసం విరాళంగా ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. 22ఏ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడతామని ఆయన పునరుద్ఘాటించారు.
Advertisement
KTR
Revanth Reddy
KCR Farmhouse Assets
Telangana Politics
BRS Party
KCR Family Property Investigation

More Telugu News