చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ.. 100 గోల్స్ క్లబ్‌లో చేరిక

చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ.. 100 గోల్స్ క్లబ్‌లో చేరిక

Lionel Messi creates history by joining 100 goals club for Inter Miami
  • ఇంటర్ మయామి తరఫున 100వ గోల్ నమోదు చేసిన మెస్సీ
  • కాంపియోన్స్ కప్‌ను కైవసం చేసుకున్న ఇంటర్ మయామి
  • క్రూజ్ అజుల్‌పై 2-0 తేడాతో ఘన విజయం
  • ఎంఎల్ఎస్‌ చరిత్రలో వేగంగా 100 గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు
  • మెక్సికన్ జట్ల ఆధిపత్యానికి తెరదించిన మయామి
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇంటర్ మయామి క్లబ్ తరఫున తన 100వ గోల్‌ను నమోదు చేయడమే కాకుండా జట్టుకు మరో కీలక టైటిల్‌ను అందించాడు. నిన్న‌ జరిగిన కాంపియోన్స్ కప్ ఫైనల్‌లో ఇంటర్ మయామి 2-0 తేడాతో క్రూజ్ అజుల్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఒక గోల్ చేసి, మరో గోల్‌కు అసిస్ట్ అందించి మెస్సీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆట ప్రారంభమైన 24వ నిమిషంలోనే మెస్సీ అద్భుతం చేశాడు. సహచర ఆటగాడు లూయిస్ సువారెజ్ అందించిన క్రాస్‌ను అద్భుతమైన డైవింగ్ హెడర్‌తో గోల్‌గా మలిచాడు. ఇది ఇంటర్ మయామి తరఫున అతనికి 100వ గోల్ కావడం విశేషం. కేవలం 115 మ్యాచ్‌లలోనే ఈ ఫీట్ సాధించి, 'మేజర్ లీగ్ సాకర్' (ఎంఎల్ఎస్‌) చరిత్రలో ఒక క్లబ్ తరఫున అత్యంత వేగంగా 100 గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు మయామి తరఫున మెస్సీ 100 గోల్స్, 55 అసిస్ట్‌లు నమోదు చేశాడు.

ఆ తర్వాత 81వ నిమిషంలో మెస్సీ అందించిన కార్నర్ కిక్‌ను కాసెమిరో హెడర్‌తో గోల్ చేసి జట్టు ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. ఈ విజయంతో ఇంటర్ మయామి తన చరిత్రలో తొలిసారి కాంపియోన్స్ కప్‌ను ముద్దాడింది. అమెరికా ఎంఎల్ఎస్‌ కప్ విజేత, మెక్సికో Liga MX విజేత మధ్య ఏటా ఈ మ్యాచ్ జరుగుతుంది. 

గత మూడు సీజన్లుగా మెక్సికన్ జట్లే ఈ కప్‌ను గెలుచుకుంటుండగా, వారి ఆధిపత్యానికి మయామి బ్రేక్ వేసింది. కొత్త హెడ్ కోచ్ క్రిస్టియన్ గొంజాలెజ్‌కు ఇది తొలి మ్యాచ్ కాగా, తొలి మ్యాచ్‌లోనే జట్టుకు ట్రోఫీని అందించడం విశేషం.

2023లో ఇంటర్ మయామిలో చేరిన మెస్సీ, తన తొలి గోల్‌ను కూడా ఇదే క్రూజ్ అజుల్ జట్టుపైనే నమోదు చేశాడు. 39 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న మెస్సీ, తన రాకతో జట్టుకు లీగ్స్ కప్, సపోర్టర్స్ షీల్డ్, ఎంఎల్ఎస్‌ కప్ వంటి పలు టైటిళ్లను అందించాడు. తాజాగా కాంపియోన్స్ కప్‌తో మరో ట్రోఫీని జట్టు ఖాతాలో చేర్చాడు.
Advertisement
Lionel Messi
Inter Miami
Champions Cup
MLS
Luis Suarez
Cruz Azul

More Telugu News