ప్రధాని మోదీకి చంద్రబాబు, లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు

ప్రధాని మోదీకి చంద్రబాబు, లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు

cm chandrababu lokesh extend birthday wishes to pm modi
  • మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ చరిత్రాత్మకమని కొనియాడిన టీడీపీ అధినేత
  • ప్రధాని స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని ప్రశంసించిన నారా లోకేశ్
  • దేశాభివృద్ధికి మోదీ నాయకత్వం కొత్త ఊపునిచ్చిందని వ్యాఖ్య
  • వారణాసిలో ప్రధాని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం సోషల్ మీడియా వేదికగా వారు తమ సందేశాలను పంచుకున్నారు.

"గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, సుదీర్ఘకాలం సేవలందిస్తున్న ప్రధానిగా మీ నాయకత్వం చరిత్రాత్మకం. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా సుమారు 25 ఏళ్ల మీ ఆదర్శప్రాయమైన ప్రజాసేవ భారత ప్రగతి ప్రస్థానానికి నూతనోత్తేజాన్ని అందించింది. 'సేవ, సంకల్ప్, సుశాసన్' అనే మీ దార్శనికత 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తినిస్తోంది" అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశసేవలో ప్రధాని మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని, ఆయనకు శ్రీ వేంకటేశ్వరస్వామి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.

నారా లోకేశ్ సైతం ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. "సాధారణ నేపథ్యం నుంచి ఎదిగి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తున్న మీ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. మీలోని అపారమైన శక్తి, క్రమశిక్షణ, దేశాభివృద్ధి పట్ల మీకున్న అచంచలమైన నిబద్ధత ప్రజాక్షేత్రంలో ఉన్న మా వంటి లక్షలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి" అని కొనియాడారు.

ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో నిర్వహించనున్న 'సేవా సంకల్ప్' వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.                                        
Advertisement
Chandrababu
Nara Lokesh
PM Narendra modi
birth day

More Telugu News