ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు వేగవంతమయ్యాయి: కిషన్ రెడ్డి
- రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన కిషన్ రెడ్డి
- ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రక్షణశాఖ సమ్మతి తెలిపిందని వెల్లడి
- డీపీఆర్, మాస్టర్ ప్లాన్ ప్రక్రియ త్వరగా ముగించాలని నిర్ణయించామన్న కేంద్ర మంత్రి
ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాజెక్టు పురోగతిపై ఈరో ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఆయన చర్చించారు.
ఈ భేటీలో ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (JUA) అభివృద్ధికి రక్షణ మంత్రిత్వ శాఖ సంపూర్ణ సమ్మతి తెలిపినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్ట్ పురోగతిని వేగవంతం చేసేందుకు రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి వచ్చే వారంలోగా ఒక్కో నోడల్ అధికారిని నియమించాలని నిర్ణయించినట్టు తెలిపారు. డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించామని చెప్పారు.
గత ఏప్రిల్ 17న అధికారుల బృందం క్షేత్రస్థాయి స్థలాన్ని పరిశీలించి 2.75 కిలోమీటర్ల రన్‌వే నిర్మాణానికి ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) వద్ద ఉన్న 369.45 ఎకరాలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూమిని సేకరించనుందని తెలిపారు. ఇక్కడ ఎయిర్‌ఫోర్స్ శిక్షణా కేంద్రాలు, హ్యాంగర్లతో పాటు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పౌర విమానాల సివిల్ టెర్మినల్, మెయింటెనెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.