బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ... కొండా సురేఖ తొలగింపుపై తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు

బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ... కొండా సురేఖ తొలగింపుపై తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు

BRS Mock Assembly Talasani Srinivas Yadav satirical remarks on Konda Surekha removal
  • తెలంగాణ భవన్‌లో 'నమూనా అసెంబ్లీ' నిర్వహించిన బీఆర్ఎస్
  • సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు
  • మాజీ మంత్రి కొండా సురేఖ తొలగింపుపై తలసాని సెటైర్లు
  • 100 రోజుల హామీల అమలుపైనా చురకలు అంటించిన బీఆర్ఎస్
  • అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు నిరసనగా ఈ కార్యక్రమం
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ' నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై, ప్రభుత్వ హామీల అమలుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఈ మాక్ అసెంబ్లీలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్‌గా వ్యవహరించగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్రను పోషించి రేవంత్ రెడ్డిని అనుకరిస్తూ మాట్లాడారు. ఇటీవల మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, "కొండా సురేఖ కుమార్తె నా గురించి మాట్లాడినందుకే ఢిల్లీకి వెళ్లి, మూడు రోజులు ఉండి, ఆమెను (సురేఖను) అణచివేసి వచ్చాను. బీసీ బిడ్డనైన నేను సీఎం అయ్యాక, ఆమెను కేబినెట్ నుంచి తీసేయక ఏం చేయగలను?" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రకటించిన 100 రోజుల హామీలపైనా తలసాని చురకలంటించారు. "100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం కానీ, ఏ 100 రోజుల్లో అని చెప్పామా? ఢిల్లీలో మాకూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా" అంటూ ఎద్దేవా చేశారు.

తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల ప్రవర్తన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఆరోగ్యంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై చర్చకు పట్టుబట్టినందుకు గాను, సెప్టెంబర్ 9న కేటీఆర్ తో సహా 22 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌కు నిరసనగానే బీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కేటీఆర్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ వేదికపై, ప్రభుత్వం చర్చకు అనుమతించని ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.
Advertisement
Talasani Srinivas Yadav
BRS Mock Assembly
Revanth Reddy
Konda Surekha
Telangana Politics
BRS MLA Suspension

More Telugu News