కేసీఆర్ నా సూచనలు పట్టించుకోలేదు.. రేవంత్ రెడ్డి ఆ తప్పు చేయకూడదు: రాజాసింగ్
- హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ చేయడానికి నిధులు మంజూరు చేయడాన్ని స్వాగతించిన రాజాసింగ్
- నిధుల వినియోగంలో స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వాములు చేయాలని విన్నపం
- ముందుగా బస్తీలు, గల్లీల్లో ప్రాథమిక సమస్యలు తీరాలని సూచన
తెలంగాణ శాసనసభలో 'కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లు' (CURE Bill) పై జరిగిన చర్చ సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన... శాసనసభ్యులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లేదా ప్రజా సమస్యలపై సూచనలు చేసినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లాది నిధులు మంజూరు చేయడం ఆహ్వానించదగిన పరిణామమే అయినప్పటికీ... ఆ నిధుల వినియోగంలో స్థానిక ఎమ్మెల్యేలకు తగిన భాగస్వామ్యం కల్పించాలని కోరారు.
గత బీఆర్‌ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ కూడా హైదరాబాద్‌ను గొప్పగా అభివృద్ధి చేయాలని భావించినప్పటికీ... హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశాలు పెట్టాలని తాను ఇచ్చిన సూచనలను ఆయన పట్టించుకోలేదని రాజాసింగ్ గుర్తుచేశారు. ఇప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తప్పు చేయకుండా, నగర పరిధిలోని ఎమ్మెల్యేలందరితో కలిసి ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, స్థానిక సమస్యలపై ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయికి చేరాలంటే ముందుగా బస్తీలు, గల్లీలలో ఉన్న ప్రాథమిక సమస్యలు తీరాలని రాజాసింగ్ పేర్కొన్నారు. నగరంలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల మధ్య తీవ్ర అస్తవ్యస్త పరిస్థితి నెలకొందని... మంచినీటి సరఫరా ప్రారంభమైన మొదటి 30 నిమిషాలు మురికి నీరే వస్తోందని సభ దృష్టికి తెచ్చారు. కొన్ని ప్రాంతాలలో అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున 3, 4 గంటలకు నీరు విడుదల చేస్తుండటంతో ప్రజలు నిద్రలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తగినంత రవాణా, డ్రైనేజీ సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలించకుండానే బహుళ అంతస్తుల (హైరైజ్) భవనాలకు అనుమతులు ఇవ్వడం వల్ల సమస్య మరింత సంక్లిష్టంగా మారుతోందని విమర్శించారు.